kangana ranaut: రాజకీయ ప్రవేశంపై నటి కంగనా రనౌత్ ఆసక్తికర స్పందన
- రాజకీయాలంటే తనకు ఆసక్తి ఉన్నట్టు వెల్లడి
- కానీ రాజకీయాల్లోకి రావడంపై ప్రణాళికలు లేవని స్పష్టీకరణ
- నటనలో రాజకీయ ఆసక్తిని ప్రదర్శిస్తానని ప్రకటన
కంగనా రనౌత్.. బాలీవుడ్ నటిగానే కాదు, వర్తమాన సామాజిక అంశాలపై సీరియస్ గా స్పందించే ఫైర్ బ్రాండ్ గా కూడా పరిచయం. తన వ్యాఖ్యలతో ఎప్పుడూ ఆమె వార్తల్లో నిలుస్తుంటారు. అధికార బీజేపీకి అనుకూల వాదిగా కనిపిస్తారు. దీంతో రాజకీయ ప్రవేశంపై ఆమెకు మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది.
‘‘రాజకీయాల్లోకి రావడంపై నా వద్ద ఎలాంటి ప్రణాళికలు లేవు. రానున్న సినిమాల షూటింగ్ పనులతో నేను తీరిక లేకుండా ఉన్నాను. నాకు రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది కానీ, నటిగానే నేను విజయవంతమైన నటిని. 16 ఏళ్లకే నా కెరీర్ ను ప్రారంభించాను. ఎన్నో కష్టాల తర్వాతే ఈ స్థాయికి చేరుకున్నాను’’అని కంగనా చెప్పింది. రాజకీయాల పట్ల తనకున్న ఆసక్తి తన నటనలో ప్రతిఫలిస్తుందన్నారు. రాజకీయాలను దృష్టిలో ఉంచుకునే తానెప్పుడూ మంచి సినిమాలు తీస్తుంటానన్నారు.
‘‘నేను దేశభక్తురాలిని. నా పనితో నేను ఎంతో బిజీగా ఉంటాను. కనుక దేశానికి మంచి చేసే వారికి పార్టీతో సంబంధం లేకుండా నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది’’అని కంగనా రనౌత్ తెలిపింది. ప్రధాని మోదీకి బహూకరించిన 1,200 ఉత్పత్తులను నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ లో వేలానికి ఉంచారు. గత నెల 17న ఈ-వేలం మొదలైంది. దీన్ని కంగనా సందర్శించి, అయోధ్యలో త్వరలో ప్రారంభం కానున్న రామమందిరం నమూనాకు బిడ్ సమర్పించింది.