Vikram: మూవీ రివ్యూ: 'పొన్నియిన్ సెల్వన్ -1'
- నేడు విడుదలైన 'పొన్నియిన్ సెల్వన్'
- చారిత్రక నేపథ్యంలో రూపొందిన సినిమా
- ఒకేసారి ఎక్కువ పాత్రల పరిచయం
- అయోమయానికి గురైన ప్రేక్షకులు
- అనూహ్యమైన మలుపులకు దూరంగా నడిచిన కథ
- బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ హైలైట్
మణిరత్నం ఇంతవరకూ దర్శకత్వం వహించిన సినిమాలన్నీ ఒక ఎత్తు .. 'పొన్నియిన్ సెల్వన్' ఒక ఎత్తు. భారీ బడ్జెట్ .. భారీ తారాగణం .. ప్రధానమైన పాత్రలకిగాను పెద్ద సంఖ్యలో స్టార్స్ అవసరం కావడం .. చోళుల కాలంనాటి చారిత్రక నేపథ్యానికి తగిన వాతావరణాన్ని ప్రతిబింబించడం .. ప్రతి పాత్రకి ప్రత్యేకమైన లుక్ .. అందుకు అవసరమైన కాస్ట్యూమ్స్ వీటన్నిటినీ ఒకదారిలో పెట్టడం అంత సామాన్యమైన విషయమేం కాదు. అలాంటి ఒక భారీ చారిత్రక నేపథ్యాన్ని తీసుకుని .. లైకా వారి నిర్మాణంలో మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కించారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఈ శుక్రవారమే థియేటర్లకు వచ్చింది. ఆ అంచనాలను ఈ సినిమా ఏ మేరకు అందుకుందన్నది ఇప్పుడు చూద్దాం.
వేయి సంవత్సరాల క్రితం నాటి ఈ కథ చిరంజీవి వాయిస్ ఓవర్ తో మొదలవుతుంది. సుందరచోళ మహారాజు (ప్రకాశ్ రాజ్) తంజావూరును రాజధానిగా చేసుకుని ప్రజారంజకంగా పరిపాలిస్తూ ఉంటాడు. ఆయన ఇద్దరు కుమారులలో ఒకరైన ఆదిత్య కరికాలుడు (విక్రమ్) శత్రు రాజ్యాలను ఆక్రమిస్తూ వెళుతుంటాడు. ఇక చిన్నవాడైన అరుళ్ మొళి (జయం రవి) లంకను పరిపాలిస్తూ ఉంటాడు. సుందరచోళ మహారాజు దగ్గర కోశాధికారిగా పడివేట్టరాయ (శరత్ కుమార్) పనిచేస్తుంటాడు. అతని సోదరుడు దళపతి (పార్తీబన్) కూడా అన్నగారి సూచనల మేరకు నడచుకుంటూ ఉంటాడు.
సుందర చోళ తన తరువాత రాజ్యాధికారం తన ఇద్దరు కొడుకులలో ఒకరికి అప్పగించాలని భావిస్తాడు. అయితే ఆయన సోదరుడి కొడుకైన మధురాంతకుడు (రెహమాన్)కి ఇది నచ్చదు. రాజ్యాధికారాన్ని తనకి దక్కేలా చేయమని ఆయన పడివేట్టరాయ సోదరులను ఆశ్రయిస్తాడు. ఈ విషయంలో పడివేట్టరాయ భార్య నందిని (ఐశ్వర్య రాయ్) కూడా వాళ్లకి అనుకూలంగా పావులు కదుపుతూ ఉంటుంది. అందుకు కారణం గతంలో ఆమె ఆదిత్య కరికాలన్ ను ప్రేమించి అతణ్ణి పెళ్లి చేసుకోలేకపోతుంది. ఆయన బారి నుంచి వీరపాండ్యుని ప్రాణాలను కాపాడలేకపోతుంది. అందువలన ఆ ప్రతీకారాన్ని తీర్చుకునే సమయం కోసం ఆమె ఎదురుచూస్తుంటుంది.
ఇక వీరపాండ్యుని మరణానంతరం ఆయన వర్గీయులంతా అడవిలో రహస్యంగా తలదాచుకుంటారు. ఆ వంశానికి చెందిన అమరభుజంగ పాండ్యుని రాజుని చేయాలనుకుంటారు. అదనుచూసి చోళ సోదరులను మట్టుబెట్టడానికి వ్యూహాలు పన్నుతుంటారు. ఇలా అన్ని వైపుల నుంచి ఆదిత్య కరికాలన్ ను .. అరుళ్ మొళిని ఆపదలు చుట్టుముడుతుంటాయి. ఈ విషయంలో తనకి సహకరించవలసిందిగా తన మిత్రుడైన వల్లవ రాయన్ (కార్తి)ని కోరతాడు ఆదిత్య కరికాలన్. మరో వైపు నుంచి తన సోదరులను రక్షించుకోవడానికి చోళరాజ కుమార్తె 'కుందవై'( త్రిష) రంగంలోకి దిగుతుంది. ఆ తరువాత చోటుచేసుకునే అనూహ్యమైన పరిణామాలు ఎలాంటివి అనేది కథ.
కథాపరంగా ముందుగా విక్రమ్ .. ఆ తరువాత కార్తి .. విశ్రాంతి తరువాత జయం రవి ఎంటరవుతారు. ఈ మూడు పాత్రలలో ఎవరి పాత్రకి ఉండవలసిన ప్రాముఖ్యత వారికి ఉంది. కాకపోతే తెరపై ఎక్కువ సేపు కార్తి కనిపిస్తాడు. తనని ప్రియురాలు మోసం చేసిందనే కోపంతో విక్రమ్ పాత్ర రగిలిపోతుంటుంది. అతని తమ్ముడుగా జయం రవి తండ్రి మాటను జవదాటని తనయుడిగా కనిపిస్తాడు. ఇక స్నేహానికి ప్రాణమిచ్చే వీరుడిగా కార్తి పాత్రను తీర్చిదిద్దారు. మరి ఈ ముగ్గురిలో 'పొన్నియిన్ సెల్వన్' ఎవరూ అంటే.. జయం రవి. అవును ఆయన పాత్రనే ఈ కథకు ప్రధానం .. ఆధారం.
కథ ఎంత గొప్పదైనా వినేవారికి .. చూసేవారికి అది అర్థం కావాలి. లేకపోతే దాని ప్రయోజనం నెరవేరనట్టే. సామాన్య ప్రేక్షకుడికి తెరపై ఏం జరుగుతోంది? ఎందుకు జరుగుతోంది? అనే విషయంలో స్పష్టత ఉండాలి. లేకపోతే ప్రేక్షకుడు అయోమయం నుంచి తేరుకునేలోగా సినిమా అయిపోతుంది. అలాంటి సినిమానే 'పొన్నియిన్ సెల్వన్'. ఈ కథ కన్ ఫ్యూజన్ చిరంజీవి వాయిస్ ఓవర్ తోనే మొదలవుతుంది. రాజులు .. రాజ్యాలు .. వారసులు గట్రా పేర్లను చదువుకుంటూ పోవడంతో, వాయిస్ ఓవర్ అయిపోయే సమయానికి 'ఇంతకీ మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం' అనే పరిస్థితిలో ప్రేక్షకుడు ఉంటాడు. అంతగా గుర్తుపెట్టుకోలేని పేర్లను ఒక్కసారిగా గుమ్మరించారు.
చోళరాజులకి సంబంధించిన ఈ కథ విస్తృతమైనదే. అయితే ప్రధానమైన కథకి ముందు జరిగినదంతా వాయిస్ ఓవర్ లో కవర్ చేయాలనే కంగారు వలన, ప్రేక్షకులు అయోమయంలో పడిపోయారు. ఏ పాత్ర ఎవరి తాలూకు .. ఏ పాత్ర ఉద్దేశం ఏమిటి? అనే విషయంలో వాళ్లకి స్పష్టత రావడానికి ఎక్కువ సమయమే పడుతుంది. ఇక దానికి తోడు ఆదిత్య కరికాలుడికి నందిని ఎలా దూరమైంది? అనే ఫ్లాష్ బ్యాక్ చూపించకపోవడం .. ఆమె ఉద్దేశం ఏమిటో ప్రేక్షకులను అర్థమయ్యేలా ఆవిష్కరించకపోవడం ఆ అయోమయాన్ని అలాగే కంటిన్యూ చేస్తుంది. సెకండ్ పార్టుపై ఆసక్తిని పెంచడానికి క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఆ ట్విస్ట్ ఎఫెక్ట్ ఎంతమేరకు ఉంటుందనేది సెకండ్ పార్టుకి వెళితేగాని తెలియదు. అప్పటివరకూ ఈ అయోమయంలో పడి కొట్టుకోవలసిందే.
రాజులు .. రాజ్యాలు .. వారసత్వాలు .. సింహాసనం కోసం పోరాటాలు .. ఈ తరహా కథావస్తువుతో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. ఈ కథ కూడా అలాంటిదే. అయితే ఈ కథను ఉత్కంఠను రేకెత్తించే విధంగా మణిరత్నం అల్లుకోలేకపోయారు. సామాన్య ప్రేక్షకులకు వెంటనే అర్థమయ్యేలా చెప్పలేకపోయారు. ముగ్గురు స్టార్ హీరోలు తెరపై ఉన్నప్పటికీ ఏ ఒక్కరితోను రొమాంటిక్ సీన్స్ ను గానీ .. సాంగ్స్ ను గాని ఆయన ప్లాన్ చేయకపోవడం మాస్ ఆడియన్స్ కి నిరాశను కలిగించే విషయం. ఇక సముద్రంలో పడవ నడిపే అమ్మాయితో కార్తికి ఒక అద్భుతమైన రొమాంటిక్ సాంగ్ ఉంటుందని ప్రేక్షకులంతా భావించారు. కానీ మణిరత్నం అక్కడ కూడా నీళ్లు చల్లేశారు.
ఇక ప్రధానమైన పాత్రల వేషధారణను డిజైన్ చేసుకోవడం .. పోరాట సన్నివేశాలను చిత్రీకరించే విషయంలోను .. ఆయన మార్కు దృశ్యాలను ఆవిష్కరించడంలోను ఆయనకి వంకబెట్టలేము. కాకపోతే కథా పరంగాను .. ఖర్చుకు వెనుకాడని పరిస్థితి ఉన్నప్పటికీనూ ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో రంజింపజేయలేకపోయారు. ఇక ఈ సినిమా కథాకథనాల సంగతి అటుంచితే, ఏఆర్ రెహ్మాన్ ట్యూన్స్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఇక ఆ ట్యూన్స్ లో పేర్చిన తెలుగు పదాలను అర్థం చేసుకోవడానికి చాలానే ఓపిక కావాలి.
అయితే, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం రెహ్మాన్ విజృంభించాడనే చెప్పాలి. ఈ సినిమాకి ప్రధానమైనది ఏదైనా ఉందంటే అది ఫొటోగ్రఫీ అనే చెప్పాలి. యాక్షన్ దృశ్యాలు .. ఛేజింగ్ దృశ్యాలు .. సముద్రం నేపథ్యంలో దృశ్యాలను రవివర్మన్ అద్భుతంగా ఆవిష్కరించారు. ముఖ్యంగా 'పొంగేనది' అనే పాటలోని విజువల్స్ చూడటానికి రెండు కళ్లు చాలవు. శ్రీకర ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఓకే.
ఇది ఒక సినిమాకి తగిన కథా వస్తువే. మణిరత్నం వంటి దర్శకులు తెరకెక్కించదగిన చారిత్రక నేపథ్యమే. అయితే స్క్రీన్ పరమైన పట్టు ఆశించిన స్థాయిలో కనిపించదు. నిర్మాణ పరమైన విలువల విషయంలో భారీ చిత్రాల వరుసలోనే నిలుస్తుంది. కానీ సామాన్య ప్రేక్షకులకు అర్థంకాని కథగానే కనిపిస్తుంది. స్టార్స్ పరంగా .. దర్శకుడిగా మణిరత్నంకి గల పేరు కారణంగా ఈ సినిమా ఓపెనింగ్స్ కి ఢోకా ఉండకపోవచ్చు. ఆ తరువాత ప్రరిస్థితి ఏమిటనేది చూడాలి. స్క్రిప్ట్ పరమైన విషయాలను అలా పక్కనుంచితే, ఈ వయసులో మణిరత్నం ఇంతటి భారీ చిత్రాన్ని హ్యాండిల్ చేసిన తీరును మాత్రం అభినందించకుండా ఉండలేం.