Aung San Suu Kyi: పెండింగ్ లో ఉన్న కేసుల్లో కూడా తీర్పులు వస్తే ఆంగ్ సాన్ సూకీకి 200 ఏళ్ల జైలుశిక్ష!
- మయన్మార్ లో కొనసాగుతున్న సైనిక పాలన
- ఆంగ్ సాన్ సూకీపై పెద్ద సంఖ్యలో కేసులు
- ఇప్పటికే పలు కేసుల్లో 20 ఏళ్ల జైలు శిక్ష
- గతంలో సూకీకి ఆర్థిక సలహాదారుగా వ్యవహరించిన టర్నెల్
- గతేడాది ఫిబ్రవరిలో టర్నెల్ అరెస్ట్
మయన్మార్ లో సైనిక పాలకుల వల్ల పదవీచ్యుతురాలైన ఆంగ్ సాన్ సూకీకి మరో కేసులో శిక్ష పడింది. అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారంటూ ఆంగ్ సాన్ సూకీతో పాటు ఆమె మాజీ ఆర్థిక సలహాదారు, ఆస్ట్రేలియా జాతీయుడైన షాన్ టర్నెల్ కు కూడా మయన్మార్ సైనిక కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది.
ఇప్పటికే కొన్ని కేసుల్లో ఆంగ్ సాన్ సూకీకి 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడింది. ఆమెపై మయన్మార్ సైనిక ప్రభుత్వం నమోదైన కేసులన్నింటిలో శిక్షలు ఖరారు చేస్తే సుమారు 200 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. ఆంగ్ సాన్ సూకీ ఇక బాహ్యప్రపంచాన్ని చూడకూడదన్నది మయన్మార్ సైనికుల పాలకుల లక్ష్యంగా కనిపిస్తోంది.
కాగా, ప్రముఖ ఆర్థికవేత్త షాన్ టర్నెల్ ను 2021 ఫిబ్రవరిలో మయన్మార్ పోలీసులు యాంగూన్ లో అరెస్ట్ చేశారు. ఆయనకు స్థానిక మిలిటరీ కోర్టు జైలు శిక్ష విధించడం పట్ల ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. టర్నెల్ ను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. మయన్మార్ కోర్టు తీర్పును ఎట్టి పరిస్థితుల్లోనూ తాము అంగీకరించబోమని స్పష్టం చేసింది.
టర్నెల్ పై మయన్మార్ ప్రభుత్వం మోపిన అభియోగాలను తాము గత 19 నెలలుగా తిరస్కరిస్తున్నామని ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ వెల్లడించారు. టర్నెల్ అరెస్ట్ అక్రమం అని పేర్కొన్నారు. షాన్ టర్నెల్ ఆస్ట్రేలియాలోని మాక్వేరీ యూనివర్సిటీలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.