BJP: ఆంధ్రజ్యోతి కథనాలపై వేమూరి రాధాకృష్ణకు ఏపీ బీజేపీ నోటీసులు
- బీజేపీ నేతలపై సెప్టెంబర్లో వరుసగా 3 కథనాలు రాసిన ఆంధ్రజ్యోతి
- సదరు కథనాలపై వివరాలు అందజేయాలని కోరుతూ నోటీసులు
- నిర్దేశిత సమయంలోగా వివరాలు అందించకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనాలపై ఏపీ బీజేపీ శాఖ ఆ పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణకు బుధవారం నోటీసులు జారీ చేసింది. ఎటువంటి ఆధారాలు , పూర్తి వివరాలు లేకుండా బీజేపీకి నష్టం కలిగించే విధంగా వరుస కథనాలను ప్రచురించిన ఆంధ్రజ్యోతి యాజమాన్యాన్ని వారం రోజుల్లో పూర్తి వివరాలు, ఆధారాలు అందించాలని సదరు నోటీసుల్లో ఆ పార్టీ కోరింది.
ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి పత్రికలో బీజేపీ నేతలను ఉటంకిస్తూ ప్రచురితమైన 3 కథనాలను బీజేపీ ప్రస్తావించింది. 'కమలం నేత... కోట్లలో మేత' పేరిట ఈ నెల 6న ప్రచురితమైన కథనంతో పాటు.. 'వసూళ్లపై ఢిల్లీ కూపీ' పేరిట ఈ నెల 18 ప్రచురితమైన మరో కథనం, 'కమలంలో కలెక్షన్ క్వీన్' పేరిట ఈ నెల 24న ప్రచురితమైన కథనాన్ని బీజేపీ ప్రస్తావించింది.
బీజేపీని దెబ్బ తీయడమే లక్ష్యంగా ఈ కథనాలను ప్రచురించినట్లుగా అనిపిస్తోందని ఆ పార్టీ తన నోటీసుల్లో పేర్కొంది. నిర్దేశిత సమయంలోగా వివరాలు అందించని పక్షంలో బహిరంగ క్షమాపణ చెప్పాలని... లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బీజేపీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి పాలూరి శ్రీనివాసరావు ఈ నోటీసులను జారీ చేశారు.