Andhra Pradesh: అమరావతిపై విస్తృత దృక్పథంతోనే చంద్రబాబు నిర్ణయం: జగ్గారెడ్డి
- ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు సరికాదన్న జగ్గారెడ్డి
- 3 చోట్ల 3 రాజధానుల అభివృద్ధి సాధ్యం కాదని వెల్లడి
- ఈ రెండు అంశాల్లో సీఎం జగన్‌వి తప్పుడు నిర్ణయాలేనన్న కాంగ్రెస్ నేత
- అధికారంలో ఉన్నప్పుడు చేసే పనులు ఆమోదయోగ్యంగా ఉండాలని వ్యాఖ్య
ఏపీకి చెందిన రెండు కీలక అంశాలపై తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి 3 రాజధానుల దిశగా సాగుతున్న ఏపీ ప్రభుత్వ తీరు, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి పేరు మారుస్తూ వైసీపీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై ఆయన స్పందించారు. ఈ రెండు అంశాల్లోనూ ఏపీ సీఎం జగన్‌ది తప్పుడు నిర్ణయమేనని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు సరికాదని వ్యాఖ్యానించిన జగ్గారెడ్డి... ఈ విషయంలో ఏపీ సీఎం జగన్ నిర్ణయం సరికాదని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు చేసే పనులు ఆమోదయోగ్యంగా ఉండాలని కూడా జగ్గారెడ్డి అన్నారు. ఏపీకి అమరావతే రాజధానిగా ఉండాలనేది కాంగ్రెస్ నిర్ణయమన్న జగ్గారెడ్డి... ఏపీ కాంగ్రెస్ కూడా అదే నిర్ణయంతో ఉందని వెల్లడించారు. 3 ప్రాంతాల్లో 3 రాజధానుల నిర్ణయం సరికాదన్న కాంగ్రెస్ నేత.. 3 చోట్ల 3 రాజధానుల అభివృద్ధి సాధ్యం కాదని అన్నారు. ఈ విషయంలో సీఎం జగన్‌ది తప్పుడు నిర్ణయమేనని ఆయన అన్నారు. అమరావతిపై చంద్రబాబు విస్తృత దృక్పథంతోనే నిర్ణయం తీసుకున్నారని కూడా జగ్గారెడ్డి తెలిపారు.