MEA: కెనడాలో విద్వేషపూరిత దాడులు పెరుగుతున్నాయి... భారత పౌరులు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి: విదేశాంగ శాఖ

MEA alerts Indian people and students in Canada

  • కెనడాలో హిందూ ఆలయాలపై దాడులు
  • ప్రబలుతున్న సిక్కు అతివాద ధోరణులు
  • అవి భారత వ్యతిరేక చర్యలేనన్న కేంద్రం

కెనడాలో సిక్కు అతివాద ధోరణులు ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కెనడాలో హిందూ ప్రార్థనా మందిరాలపైనా, మతపరమైన చిహ్నాలపైనా దాడులు జరుగుతుండడంతో కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. కెనడాలో విద్వేషపూరిత దాడులు పెరుగుతున్నాయని, భారత పౌరులు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. భారత వ్యతిరేక చర్యలకు పాల్పడే ఓ మతపరమైన వర్గం హింసకు పాల్పడుతోందని పేర్కొంది. 

కాగా, ఇదే విధమైన భావనలను భారత కేంద్ర ప్రభుత్వం నిన్ననే కెనడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లింది. రాజకీయ ప్రేరేపితమైన అతివాద శక్తులు తమ కార్యకలాపాల కోసం కెనడా భూభాగాన్ని వాడుకోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది.

ఖలిస్థాన్ ఉద్యమం మళ్లీ రెక్కలు విప్పుతోందన్న వాదనలకు కెనడాలో చోటుచేసుకున్న తాజా ఘటనలే నిదర్శనం. ఖలిస్థాన్ ఉద్యమ మద్దతుదారులు కెనడాలో రిఫరెండం నిర్వహించడం తెలిసిందే. హిందూ మత చిహ్నాలపై దాడిచేసి ఖలిస్థాన్ జిందాబాద్ అని రాశారు. ఈ పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోంది.

MEA
Canada
India
Khalistan
  • Loading...

More Telugu News