AP Assembly Session: స్పీకర్ పై పేపర్లు చింపి విసిరేసిన టీడీపీ ఎమ్మెల్యేలు.. అసెంబ్లీ నుంచి సస్పెన్షన్
- ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు అంశంతో అట్టుడుకిన ఏపీ అసెంబ్లీ
- స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు
- టీడీపీ ఎమ్మెల్యేలను బలవంతంగా తీసుకెళ్లిన మార్షల్స్
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును వైఎస్సార్ యూనివర్శిటీగా మార్చాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై అసెంబ్లీ అట్టుడుకింది. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ టీడీపీ సభ్యులు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు. యూనివర్శిటీని ఏర్పాటు చేసిందని ఎన్టీఆర్ అని... ఆయన గౌరవార్థం ఆ తర్వాత యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును పెట్టడం జరిగిందని చెప్పారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. బిల్లు కాపీలను చించేసి స్పీకర్ పైకి విసిరేశారు. స్పీకర్ పై పేపర్లను చింపి వేయడంపై వైసీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా సమావేశాలు సజావుగా సాగేలా సహకరించాలని టీడీపీ సభ్యులను స్పీకర్ పదేపదే కోరినప్పటికీ వారు శాంతించలేదు.
దీంతో సభ నుంచి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన తీర్మానం చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసినప్పటికీ టీడీపీ సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లలేదు. ప్రాణాలు అర్పించైనా సరే... ఎన్టీఆర్ పేరును సాధిస్తామని నినాదాలు చేశారు. ఈ క్రమంలో వారిని మార్షల్స్ బలవంతంగా బయటకు తీసుకెళ్లారు.