QR Code: ఇక శ్రీవారి భక్తుల అరచేతిలో తిరుమల రూట్ మ్యాప్
- కొత్తగా క్యూఆర్ కోడ్ తీసుకువస్తున్న టీటీడీ
- కోడ్ స్కాన్ చేస్తే వివరాలు
- కొండపై ఎక్కడ ఏముందో భక్తుల ఫోన్ లో ప్రత్యక్షం
- శ్రీవారి వాలంటీర్లతో ప్రయోగాత్మకంగా అమలు
తిరుమలలో భక్తుల సౌకర్యార్థం అనేక కార్యాలయాలు, వసతి గృహ సముదాయాలు, గెస్ట్ హౌసులు, క్యూ కాంప్లెక్స్ లు, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వివిధ సేవలు అందించే ఈ కార్యాలయాలు, సముదాయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇకపై భక్తులు సులువుగా తెలుసుకోవచ్చు. అందుకోసం టీటీడీ ప్రత్యేకంగా ఓ క్యూఆర్ కోడ్ ను తీసుకువచ్చింది. దీని ద్వారా శ్రీవారి భక్తుల అరచేతిలో తిరుమల రూట్ మ్యాప్ ప్రత్యక్షం కానుంది.
ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా తిరుమలలో కార్యాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చు. టీటీడీ వసతి సముదాయాలు, గెస్ట్ హౌసులు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లు, లడ్డూ కౌంటర్లు, ఆసుపత్రి, పోలీస్ స్టేషన్లు, విజిలెన్స్ కార్యాలయాల వివరాలన్నీ మొబైల్ ఫోన్ లో కనిపిస్తాయి. తద్వారా కొండపై ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లేందుకు సులువు అవుతుందని టీటీడీ పేర్కొంది.
వెళ్లాల్సిన చోటుపై క్లిక్ చేస్తే రూట్ మ్యాప్ వస్తుందని, దాన్ని అనుసరించి వెళితే గమ్యస్థానం చేరుకోవచ్చని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. తొలుత దీన్ని శ్రీవారి వాలంటీర్ల ద్వారా ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు.