Bhagwant Mann: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మద్యం సేవించి విమానమెక్కితే దించేశారంటూ కథనాలు... ఖండించిన ఆప్

AAP condemns allegations on Punjab CM Bhagwant Mann

  • ఫ్రాంక్ ఫర్ట్ నుంచి ఢిల్లీ వచ్చిన మాన్
  • నిన్న మధ్యాహ్నం 1.40 గంటలకు విమానం
  • సాయంత్రం 4.30 గంటలకు బయల్దేరిన విమానం
  • మాన్ తాగుడు వల్లే విమానం ఆలస్యమైందంటూ ప్రచారం

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మద్యం సేవించి విమానం ఎక్కి గొడవకు దిగితే, విమాన సిబ్బంది బలవంతంగా ఆయనను దించేశారని ఈ ఉదయం నుంచి కథనాలు వస్తున్నాయి. సీఎం భగవంత్ మాన్ విమానమెక్కి గొడవ చేయడం వల్ల ఫ్రాంక్ ఫర్ట్ నుంచి ఢిల్లీ రావాల్సిన లుఫ్తాన్సా విమాన సర్వీసు ఆలస్యమైందని కూడా ఆ కథనాల్లో పేర్కొన్నారు. 

దాంతో విపక్షాలు ఇదే అదనుగా విమర్శలతో విజృంభించాయి. భగవంత్ మాన్ తన ప్రవర్తనతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పంజాబీలు సిగ్గుతో తలదించుకునేలా చేశారని అకాలీదళ్ నేత సుఖ్ బీర్ సింగ్ బాదల్ విమర్శించారు. భగవంత్ మాన్ అధిక మోతాదులో మద్యం తాగడంతో విమానంలో తూలిపోతూ కనిపించినట్టు సహప్రయాణికులు చెబుతున్నారని వివరించారు.

అయితే, విపక్షాల ప్రచారాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఖండించింది. ఆ కథనాల్లో ఏమాత్రం వాస్తవంలేదని స్పష్టం చేసింది. అంతేకాదు, విమాన సర్వీసు ఎందుకు ఆలస్యం అయిందో వివరణ ఇస్తూ లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ జారీ చేసిన ప్రకటనను కూడా ఆప్ పంచుకుంది. ఇందులో మాన్ పాత్ర ఏమీ లేదని తమ నేతకు క్లీన్ చిట్ ఇచ్చింది. 

పంజాబ్ సీఎం మాన్ ఆదివారం మధ్యాహ్నం 1.40 గంటలకు ఫ్రాంక్ ఫర్ట్ లో విమానం ఎక్కాల్సి ఉంది. ఆ విమానం ఎంతో ఆలస్యంగా సాయంత్రం 4.30 గంటలకు టేకాఫ్ తీసుకుంది. దాంతో ఆ ప్రయాణాన్ని విరమించుకున్న మాన్ ఈ వేకువజామున మరో విమానంలో ఢిల్లీ వచ్చారు. ఆయన అస్వస్థత పాలవడం వల్లనే మరో విమానంలో రావాల్సి వచ్చిందన మాన్ సన్నిహితుడొకరు చెప్పారు.

  • Loading...

More Telugu News