Capt Amarinder Singh: బీజేపీలో చేరిన పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్
- బీజేపీ పెద్దల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్న కెప్టెన్
- పీఎల్సీ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్టు ప్రకటన
- అమరీందర్ కు స్వాగతం పలికిన కేంద్రమంత్రులు
పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ పెద్దల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. అంతేకాదు, తాను స్థాపించిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ) పార్టీని కమల దళంలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, కిరణ్ రిజిజు, పంజాబ్ బీజేపీ చీఫ్ అశ్వని శర్మ తదిరులు అమరీందర్ సింగ్ కు పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు.
పంజాబ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపించిన అమరీందర్ సింగ్... అనూహ్యరీతిలో సీఎం పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ అధిష్ఠానం తన పట్ల వ్యవహరించి తీరుతో ఆగ్రహం వ్యక్తం చేసిన అమరీందర్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం, గతేడాది పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ) పార్టీని ప్రకటించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేశారు.
ఇటీవలే అమరీందర్ సింగ్ వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకుని లండన్ నుంచి తిరిగొచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలిసి బీజేపీలో చేరికపై చర్చించారు.