Telangana: అక్టోబర్ 10 నుంచి తెలంగాణ ఐసెట్ కౌన్సెలింగ్... షెడ్యూల్ ఇదిగో
- అక్టోబర్ 10 నుంచి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన
- అదే నెల 23న ముగియనున్న తొలి విడత కౌన్సెలింగ్
- 23 నుంచి 28 వరకు తుది విడత కౌన్సెలింగ్
తెలంగాణలో ఎంసీఏ, ఎంబీఏ ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే ఐసెట్ కౌన్సెలింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం షెడ్యూల్ ఖరారు చేసింది. అక్టోబర్ 10 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానున్నట్లు ప్రకటించింది. సోమవారం సాయంత్రం వెలువడిన షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 10 నుంచి 13 వరకు విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. అదే సమయంలో అక్టోబర్ 10 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్లను అభ్యర్థులు ఎంచుకునేందుకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత అక్టోబర్ 18న ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అభ్యర్థులకు తొలి విడత సీట్ల కేటాయింపు జరగనుంది.
ఇక ఐసెట్ తుది విడత కౌన్సెలింగ్ అక్టోబర్ 23 నుంచి ప్రారంభం కానుంది. తుది విడత కౌన్సెలింగ్‌లో భాగంగా అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అక్టోబర్ 23 నుంచి 25 వరకు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత అక్టోబర్ 28న ఎంబీఏ, ఎంసీఏ తుది విడత సీట్ల కేటాయింపు జరగనుంది. వెరసి అక్టోబర్ 10 నుంచి మొదలు కానున్న ఐసెట్ కౌన్సెలింగ్ అదే నెల 28న ముగియనుంది.