TRS: కల్వకుర్తి టీఎర్ఎస్‌లో కలకలం.. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వైఖరికి నిరసనగా ఎంపీపీ సహా సర్పంచుల రాజీనామా
- టీఆర్ఎస్ మండలాధ్యక్షుడికి రాజీనామా లేఖలు
- ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం వైస్ చైర్మన్ వావిళ్ల సంజీవకుమార్ రాజీనామా
- చైర్మన్ నియామకం విషయంలో అన్యాయం జరిగిందని ఆరోపణ
- సమస్యను పరిష్కరిస్తానన్న మండలాధ్యక్షుడు
కల్వకుర్తి టీఆర్ఎస్‌లో కలకలం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వైఖరికి నిరసనగా ఎంపీపీ, ఆరుగురు సర్పంచులు రాజీనామా చేస్తూ టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు భూపతిరెడ్డికి లేఖలు సమర్పించారు. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ నిర్ణయాలు, వైఖరికి నిరసనగానే రాజీనామా చేస్తున్నట్టు సర్పంచులు తెలిపారు. కల్వకుర్తి మార్కెట్ చైర్మన్ నియామకంలో అన్యాయం జరిగిందంటూ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (సింగిల్ విండో) వైస్ చైర్మన్ వావిళ్ల సంజీవకుమార్ యాదవ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చైర్మన్ నియామకం విషయంలో జరిగిన అన్యాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు.
మరోవైపు, భూపతిరెడ్డి మాట్లాడుతూ.. రాజీనామా చేసిన నేతలు తొందరపడొద్దని, కల్వకుర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.