CM Jagan: కట్టని రాజధాని గురించి, కట్టలేని గ్రాఫిక్స్ గురించి 1000 రోజులుగా కృత్రిమ ఉద్యమాలు నడిపిస్తున్నారు: సీఎం జగన్

CM Jagan speech in assembly

  • ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వికేంద్రీకరణపై చర్చ
  • ప్రసంగించిన సీఎం జగన్
  • అమరావతి రాజధాని ప్రస్తావన
  • ఎవరి బాగు కోసం ఈ ఉద్యమాలు? అంటూ ఆగ్రహం
  • పెత్తందారీ మనస్తత్వాలు అంటూ విమర్శలు

ఏపీ సీఎం జగన్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రసంగించారు. వికేంద్రీకరణ అంశంపై చర్చ సందర్భంగా అమరావతి రాజధాని అంశంపై మాట్లాడుతూ, అభివృద్ధి చేయని, చేయలేని ప్రాంతం గురించి ఉద్యమం పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ఘాటైన విమర్శలు చేశారు. 

కట్టని రాజధాని గురించి, కట్టలేని గ్రాఫిక్స్ గురించి వెయ్యి రోజులుగా కృత్రిమ ఉద్యమాలు నడిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎవరి బాగు కోసం ఈ ఉద్యమాలు? అని సీఎం జగన్ ప్రశ్నించారు. అమరావతి రాజధాని బడుగు బలహీన వర్గాల కోసం మాత్రం కాదని, కేవలం పెత్తందార్ల స్వీయ ప్రయోజనాల కోసమేనని ఆరోపించారు. 

బినామీ భూముల ప్రాంతమే రాజధానిగా ఉండాలనేదే పెత్తందారీ సిద్ధాంతమని, పచ్చళ్లు అమ్మినా మేమే, చిట్ ఫండ్ వ్యాపారం చేసినా మా వాళ్లే చేయాలనేది పెత్తందారీ మనస్తత్వానికి నిదర్శనం అని సీఎం జగన్ పేర్కొన్నారు. "మా నారాయణ, మా చైతన్య ఉండాలనేదే పెత్తందారీ మనస్తత్వం, ఆఖరికి ప్రతిపక్ష పార్టీలోనూ మనవాళ్లే ఉండాలనేది పెత్తందారీల ఆలోచనా వైఖరి. వీళ్లందరూ కలిసి చేసిందే అమరావతి డిజైన్" అని వ్యాఖ్యానించారు. 

అమరావతిలో తమ బినామీల భూముల ధరలు పెరిగేందుకు విజయవాడ, మంగళగిరి అభివృద్ధికి అడ్డుపడ్డారని ఆరోపించారు. అయితే అమరావతిపై తనకు ఎలాంటి కోపం లేదని, ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలన్నదే తన ఆశయం అని చెప్పారు. 

అమరావతి రాజధాని ఇటు గుంటూరుకు, అటు విజయవాడకు దూరంగా ఉందని, ఆ ప్రాంతంలో కనీస వసతి సౌకర్యాలు లేవని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణానికి రూ.4 లక్షల కోట్ల నుంచి రూ.5 లక్షల కోట్ల వరకు కావాలని చంద్రబాబు చెప్పింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఎకరాకు రూ.2 కోట్లు కావాలన్నారని, అమరావతి ప్రాంతంలో కేవలం 8 కిమీ పరిధిలో 53 వేల ఎకరాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలంటే రూ.1.10 లక్షల కోట్లు ఖర్చవుతుందన్నారని వివరించారు. కానీ చంద్రబాబు పాలనలో ఏడాదికి రూ.1000 కోట్లు కూడా ఖర్చు చేయలేదని పేర్కొన్నారు. ఈ విధంగా అయితే అమరావతి నిర్మాణ వ్యయం మరో వందేళ్లకు రెండుమూడింతలు అవుతుందని చెప్పారు.

అందుకే అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి కోసమే పరిపాలనా వికేంద్రీకరణ చేస్తున్నామని, ఇది కేవలం రాజధానికే పరిమితం కాదని స్పష్టం చేశారు. అమరావతి రాజధానిని ఎక్కడికీ తరలించడంలేదని, కర్నూలు, విశాఖపట్నంలోనూ రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.

CM Jagan
Speech
Decentralization
AP Capital
Amaravati
Chandrababu
Andhra Pradesh
  • Loading...

More Telugu News