Uttar Pradesh: యూపీలోని లఖింపూర్ ఖేరి జిల్లాలో దారుణం.. అక్కాచెల్లెళ్లను అపహరించి అత్యాచారం.. ఆపై హత్య

Dalit teens found hanging from tree in Lakhimpur Kheri uttar pradesh

  • పెళ్లికి నిరాకరించడంతో కోపం పెంచుకున్న యువకులు
  • మాట్లాడాలని చెప్పి ఊరి బయటకు తీసుకెళ్లిన నిందితులు
  • అక్కడ మరోమారు పెళ్లి ప్రస్తావన
  • నిరాకరించడంతో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి అత్యాచారం చేసి హత్య
  • నలుగురు నిందితుల అరెస్ట్
  • గ్రామానికొచ్చిన పోలీసులను అడ్డుకున్న గ్రామస్థులు

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో మరో దారుణం జరిగింది. పెళ్లికి నిరాకరించారన్న కారణంతో దళిత బాలికలైన ఇద్దరు అక్కాచెల్లెళ్లపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై హత్యచేసి చెట్టుకు వేలాడదీశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని లాల్‌పూర్వా గ్రామానికి చెందిన బాధిత బాలికలను అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు పెళ్లి చేసుకోమని గత కొంతకాలంగా వేధిస్తున్నారు. అందుకు వారు నిరాకరించడంతో కక్ష పెంచుకున్నారు.  

ఈ క్రమంలో నిన్న మధ్యాహ్నం బాలికలను కలిసి మాట్లాడాలని ఉందని మాయమాటలు చెప్పి బైక్‌లపై ఎక్కించుకుని గ్రామ శివారులోని పొలాల్లోకి తీసుకెళ్లారు. అక్కడ మరోమారు వారి వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. వారి ప్రతిపాదనను బాలికలు మరోమారు తిరస్కరించారు.

దీంతో కోపోద్రిక్తులైన యువకులు తమ స్నేహితులైన మరో ఇద్దరితో కలిసి వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై వారిని హత్య చేసి ఆత్మహత్యగా నమ్మించేందుకు అక్కడే ఉన్న ఓ చెట్టుకు వేలాడదీశారు. కుమార్తెలు కనిపించకపోవడంతో వారి కోసం వెతుకుతున్న కుటుంబ సభ్యులకు గ్రామ శివారులోని ఓ చెట్టుకు వేలాడుతున్న మృతదేహాలు కనిపించాయి. అంతే, వారి గుండెలు పగిలిపోయాయి. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగి నలుగురు నిందితులతోపాటు వారికి సహకరించిన మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. 

ఈ ఘటన తర్వాత గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దర్యాప్తు కోసం గ్రామానికి వచ్చిన పోలీసులను గ్రామస్థులు అడ్డుకున్నారు. పోలీసులు వారికి నచ్చజెప్పి మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. కాగా, ఈ ఘటనపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు.  రాష్ట్ర ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. రాష్ట్రంలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే ప్రభుత్వం మాత్రం యూపీలో శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నాయని ప్రకటనలు ఇచ్చుకుంటోందని ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News