Gyanvapi mosque: జ్ఞానవాపిలో శివలింగానికి హారతి ఇచ్చిన ముస్లింలు.. తమ మద్దతు హిందువులకేనని ప్రకటన
- మసీదు ఆవరణలోని హిందూ దేవతల విగ్రహాలకు పూజలు చేసుకునేందుకు జిల్లా కోర్టు అనుమతి
- హైకోర్టును ఆశ్రయిస్తామన్న ముస్లింలు
- తాము కూడా కేవియట్ దాఖలు చేస్తామన్న హిందువుల తరపు న్యాయవాది
వివాదాస్పద జ్ఞానవాపి మసీదులో నిన్న ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. హిందువులకు అక్కడి ముస్లిం మహిళలు మద్దతు పలికారు. మసీదు ఆవరణలోని శివలింగానికి హారతి ఇచ్చి కొత్త చర్చకు తెరలేపారు. శృంగార గౌరీదేవి కాంప్లెక్స్ ఆవరణలో ఉన్న జ్ఞానవాపి మసీదు బయట గోడలపై ఉన్న హిందూ దేవతల విగ్రహాలకు పూజలు చేసుకునేందుకు జిల్లా కోర్టు అనుమతించిన మరునాడే ముస్లిం మహిళా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొందరు మహిళలు శివలింగానికి హారతి ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. పూజల అనంతరం వారు మాట్లాడుతూ.. ఈ వివాదంలో తమ మద్దతు హిందువులకేనని ప్రకటించారు.
మరోవైపు, జిల్లా కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీలు చేస్తామని అంజుమాన్ ఇంతే జామియా కమిటీ పేర్కొంది. ఈ మేరకు సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ సందర్భంగా వారి తరపు న్యాయవాది మిరాజుద్దీన్ సిద్ధిఖీ మాట్లాడుతూ.. జిల్లా కోర్టులో తమకు న్యాయం జరగలేదన్నారు. పైకోర్టును ఆశ్రయించక తప్పేలా లేదన్నారు. కాగా, ఇదే అంశంపై హిందువుల తరపు న్యాయవాది విషు జైన్ మాట్లాడుతూ.. తాము కూడా కేవియట్ దాఖలు చేస్తామని చెప్పుకొచ్చారు.