BJP: సీఎం కాగానే పీఎం అయిపోవాలంటే ఎలా?: కేసీఆర్‌పై కేంద్ర మంత్రి నారాయణ స్వామి సెటైర్లు
- కేసీఆర్‌ది ఓ పిచ్చి కల అన్న నారాయణ స్వామి
- ఎంపీ సీట్లన్నీ గెలిచి ప్రధాని కావాలన్న పిచ్చి కలలు వదిలేయాలని సూచన
- జాతీయ పార్టీ పెట్టే ముందు రాష్ట్ర సమస్యలు పరిష్కరించాలని హితవు
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయ రంగ ప్రవేశంపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నారాయణ స్వామి మంగళవారం సెటైరికల్ విమర్శలు గుప్పించారు. సీఎం కాగానే పీఎం అయిపోవాలంటే ఎలా? అంటూ ప్రశ్నించిన నారాయణ స్వామి... ఎంపీ సీట్లన్నీ గెలిచి ప్రధాని కావాలన్న పిచ్చి కలలు వదిలేయాలి అని సూచించారు. జాతీయ పార్టీ పెట్టే ముందు రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించాలని ఆయన వ్యాఖ్యానించారు.
సోమవారం ఓ కార్యక్రమంలో పాలుపంచుకున్న సందర్భంగా కేసీఆర్ జాతీయ రాజకీయ రంగ ప్రవేశంపై నారాయణ స్వామి ఘాటుగా స్పందించారు. ప్రతి ఒక్కరు ఒక ఇండిపెండెంట్‌తో, ఓ స్టేట్ పార్టీతో ఏడెనిమిది ఎంపీ సీట్లను గెలిచి ప్రధాని అయిపోవాలనుకుంటే సాధ్యపడుతుందా? అని ఆయన ప్రశ్నించారు. ఈ దిశగా కేసీఆర్ చేస్తున్న ఆలోచనలన్నీ పిచ్చి ఆలోచనలేనని ఆయన అన్నారు. ఒక సీఎంగా ఐదేళ్లలో ఎన్ని సమస్యలు పరిష్కరిస్తానన్న ఆలోచన చేసే నేత నిజమైన నాయకుడు అని ఆయన అన్నారు.