Ganesh festival: గణేశ్ చతుర్థి వేడుకల్లో రహస్య కెమెరాలతో పోకిరీల పని పట్టిన షీ టీమ్స్
![240 held sentenced to imprisonment for harassing women during Ganesh festival in Hyderabad](https://imgd.ap7am.com/thumbnail/cr-20220913tn63202a437baeb.jpg)
- మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన 240 మంది అరెస్ట్
- పలు ప్రాంతాల్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు
- వారికి జరిమానా, జైలు శిక్ష విధించిన నాంపల్లి కోర్టు
హైదరాబాద్‌లో వినాయక చతుర్థి వేడుకలు, నిమజ్జనం సందర్భంగా మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన పలువురు యువకులు కటకటాల పాలయ్యారు. మహిళలను ఇబ్బంది పెట్టిన 240 మంది పురుషులను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు వారికి జైలు శిక్ష విధించింది.
నిమజ్జన బందోబస్తులో మహిళల భద్రతపై హైదరాబాద్ పోలీసులు, షీ టీమ్స్ ప్రత్యేక దృష్టి సారించాయి. వివిధ ప్రాంతాల్లో పదుల సంఖ్యల్లో పోకిరీలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వేడుకల్లో పోలీసులు, షీ టీమ్స్ రహస్య కెమెరాలతో సివిల్ డ్రెస్సుల్లో జనంలో మమేకం అయ్యారు. ప్రజలు గుంపులుగా ఉన్నచోట్ల మహిళలను ఉద్దేశపూర్వకంగా తాకడం, తప్పుగా ప్రవర్తించడానికి ప్రయత్నించిన వారిని గుర్తించి అరెస్టు చేశారు.
అరెస్టు చేసిన వారిని హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో తగిన ఆధారాలతో హాజరుపరిచారు. వారికి కోర్టు 250 రూపాయల జరిమానాతో పాటు, రెండు రోజుల నుంచి పది రోజుల పాటు జైలు శిక్ష విధించింది. ఈ విషయంపై అదనపు పోలీసు కమిషనర్ (క్రైమ్స్, సిట్, షీ టీమ్, భరోసా) ఏఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎక్కడ ఉన్నా, ఎంత మందిలో ఉన్నా షీ టీమ్స్ కళ్ల నుంచి తప్పించుకోవడం అంత సులువు కాదన్నారు.
మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించే వాళ్లు హైదరాబాద్ షీ టీమ్‌ల రహస్య కెమెరాలకు చిక్కమని అనుకుంటే అది వాళ్ల అజ్ఞానమన్నారు. ఇలాంటి కేసుల్లో షీ టీమ్స్ కోర్టుల ముందు సరైన సాక్ష్యాలను సమర్పించడం ద్వారా నిందితులకు శిక్ష పడేలా చేస్తున్నాయని చెప్పారు.
గణేష్ చతుర్థి సందర్భంగా హైదరాబాద్‌లోని పలు మండపాల వద్ద షీ టీమ్‌లను మోహరించినట్లు ఆయన వెల్లడించారు. పండగ సందర్భంగా బాగా పని చేసిన షీ టీమ్స్ సిబ్బందిని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సి.వి. ఆనంద్ అభినందించారు.