Nalgonda District: మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ స్పీడు.. మండలాలకు ఇంచార్జీల నియామకం
![cogress party appoints incharges to the byelection of munugode](https://imgd.ap7am.com/thumbnail/cr-20220912tn631f136e97e0c.jpg)
- నారాయణపూర్ మండల ఇంచార్జీగా రేవంత్
- చౌటుప్పల్‌కు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నాంపల్లికి దామోదర రాజనర్సింహ
- చౌటుప్పల్ మునిసిపాలిటీ ఇంచార్జీగా గీతారెడ్డి నియామకం
నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ స్పీడు పెంచింది. ఇప్పటికే అన్ని పార్టీల కంటే ఉప ఎన్నికకు తన అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ... తాజాగా సోమవారం నియోజకవర్గంలోని ఆయా మండలాలకు ఇంచార్జీలుగా సీనియర్ నేతలను ఎంపిక చేసింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వయంగా ఓ మండలానికి ఇంచార్జీగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఇంచార్జీల జాబితాను సోమవారం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది.
ఈ జాబితా ప్రకారం టీపీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి నారాయణపుర్ మండల ఇంచార్జీగా వ్యవహరించనున్నారు. ఇక నాంపల్లి మండలానికి దామోదర రాజనర్సింహ, చౌటుప్పల్ ఇంచార్జీగా నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మునుగోడు ఇంచార్జీగా టీసీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మర్రిగూడ ఇంచార్జీగా మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, చండూరు ఇంచార్జీగా షబ్బీర్ అలీ, గట్టుప్పల్ ఇంచార్జీగా వి.హన్మంతరావు, చౌటుప్పల్ మునిసిపాలిటీ ఇంచార్జీగా మాజీ మంత్రి గీతారెడ్డి వ్యవహరించనున్నారు.