Rafael Nadal: నువ్వు ఇలాంటివే మరెన్నో టైటిళ్లు గెలుస్తావు అల్కారెజ్: యూఎస్ ఓపెన్ చాంపియన్ కు నాదల్ అభినందనలు

Nadal appreciates US Open Champion Carlos Alcaraz
  • యూఎస్ ఓపెన్ లో విజేతగా నిలిచిన కార్లోస్ అల్కారెజ్
  • పురుషుల సింగిల్స్ ఫైనల్లో కాస్పర్ రూడ్ పై విజయం
  • ఈ సీజన్ లో అల్కారెజ్ ఆట అద్భుతమన్న నాదల్
  • తనదేశానికే చెందిన యువకిశోరానికి శుభాకాంక్షలు
స్పెయిన్ యువకెరటం కార్లోస్ అల్కారెజ్ యూఎస్ ఓపెన్ లో పురుషుల సింగిల్స్ టైటిల్ ను కైవసం చేసుకోవడం తెలిసిందే. అల్కారెజ్ ఫైనల్లో 6-4, 2-6,7-6, 6-3తో నార్వే ఆటగాడు కాస్పర్ రూడ్ ను ఓడించి విజేతగా నిలిచాడు. కాగా, తన దేశానికే చెందిన అల్కారెజ్ ను టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్ అభినందించాడు. 

"కెరీర్ లో మొట్టమొదటి గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచినందుకు, వరల్డ్ నెంబర్ వన్ గా అవతరించినందుకు శుభాకాంక్షలు.  ఈ సీజన్ ను ఎంతో గొప్పగా సాగించావు... అంతేకాదు ఈ సీజన్ కు అద్భుతమైన ముగింపునిచ్చావు. నువ్వు ఇలాంటివే మరెన్నో టైటిళ్లు గెలుస్తావని కచ్చితంగా చెప్పగలను" అంటూ నాదల్ ట్వీట్ చేశాడు. 

అంతేకాదు, ఫైనల్లో ఓడిన కాస్పర్ రూడ్ ను కూడా నాదల్ అభినందించాడు. ఎంతో ఉన్నతంగా పోరాడావు అంటూ కితాబునిచ్చాడు. "నీ ఆటతీరు పట్ల గర్విస్తున్నాను. ఫైనల్లో నీకు అదృష్టం కలిసిరాలేదనుకుంటున్నా. కానీ ఈ టోర్నీలోనూ, సీజన్ లోనూ అమోఘమైన ఆటతీరును కనబర్చావు. ఇలాగే ఆడాలి" అంటూ పేర్కొన్నాడు. 

ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ లోనూ కాస్పర్ రూడ్ ఫైనల్లో ఓడిపోయాడు. అప్పుడు నాదల్ చేతిలో పరాజయం చవిచూశాడు. స్పెయిన్ లోని బార్సిలోనాలో ఉన్న నాదల్ టెన్నిస్ అకాడమీలోనే కాస్పర్ రూడ్ శిక్షణ పొందాడు. అందుకే శిష్యుడి ఆటతీరును ఎక్కడున్నా గమనిస్తుంటానని గతంలో నాదల్ పేర్కొన్నాడు.
Rafael Nadal
Carlos Alcaraz
Champion
US Open
Casper Ruud
Spain
Norway

More Telugu News