Brahmastra: ‘బ్రహ్మాస్త్ర’ చిత్ర బృందానికి షాక్.. విడుదలైన తర్వాతి రోజే ఆన్ లైన్ లోకి సినిమా!
- హెచ్ డీ లో లీక్ చేసిన తమిళ రాకర్స్, మూవీరుల్జ్ తదితర సైట్స్!
- ఆన్ లైన్ లో ప్రసారం చేయొద్దని విడుదలకు ముందే
18 సైట్స్ ను హెచ్చరించిన ఢిల్లీ హైకోర్టు - థియేటర్లలోనే చిత్రాన్ని చూడాలని ప్రేక్షకులను విజ్ఞప్తి చేసిన రణ్ బీర్ కపూర్
రణ్ బీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రం శుక్రవారం విడుదలైన సంగతి విదితమే. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జొహర్ నిర్మించిన ఈ చిత్రానికి ఆయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. దాదాపు 400 కోట్ల బడ్జెడ్ తో రెండు భాగాల్లో నిర్మించిన ఈ చిత్రం తొలి భాగం ‘బ్రహ్మాస్త్ర- శివ’ గా విడుదలైంది. పలు భాషల్లో కలిపి తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ. 40 కోట్ల వసూళ్లు రాబట్టింది. చిత్రంలో రణ్ బీర్, అలియాతో పాటు అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ కీలక పాత్రల్లో నటించగా.. షారూక్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించారు.
అయితే, చిత్ర బృందానికి ఒక్క రోజులోనే షాక్ తగిలింది. ఈ సినిమా ఆన్ లైన్లో లీక్ అయింది. ‘బ్రహ్మాస్త్ర’ను చట్టవిరుద్ధంగా ప్రసారం చేయవద్దని ఢిల్లీ హైకోర్టు 18 వెబ్‌సైట్‌లను హెచ్చరించినప్పటికీ, ఈ చిత్రం ఆన్‌లైన్‌లో లీక్ కావడంతో చిత్ర బృందం కలవరపడుతోంది.
సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు దీన్ని ఆన్ లైన్ లో ప్రసారం చేయకుండా 18 వెబ్‌సైట్‌లను నిరోధించాలని కోరుతూ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ స్టార్ ఇండియా చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు అనుమతించింది. అయితే, కోర్టు హెచ్చరికలు, ఆదేశాలు ఉన్నప్పటికీ తమిళ రాకర్స్, మూవీరుల్జ్, ఫిల్మిజిల్లా, 123మూవీస్, టెలిగ్రామ్ మరియు టోరెంట్ సైట్ లలో హెచ్‌డీలో ఇది లీక్ అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సినిమాను థియేటర్లలోనే చూడాలని రణ్ బీర్ కపూర్ ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశాడు. ఆన్ లైన్ లో లీక్ అయిన చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయొద్దని ఆయన అభ్యర్థించాడు.