Andhra Pradesh: అంత‌ర్రాష్ట్ర బ‌దిలీల‌కు జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌ల్‌... తెలంగాణ ఓకే చెబితేనే బ‌దిలీలు

ap cm ys jagan issues green signal to inter state transfers

  • ఏపీ నుంచి తెలంగాణ‌కు బ‌దిలీ కోరుకుంటున్న‌ 1,804 ఉద్యోగులు
  • తెలంగాణ నుంచి ఏపీకి బ‌దిలీ కోరుకుంటున్న వారు 1,338 మంది
  • తెలంగాణ‌కు బదిలీ కోరుతున్న ఉద్యోగుల‌కు ఎన్ఓసీ ఇస్తున్న ఏపీ ప్ర‌భుత్వం
  • తెలంగాణ స‌ర్కారు నిర్ణ‌యం కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులు

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శుక్ర‌వారం ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల అంత‌ర్రాష్ట్ర బ‌దిలీల‌కు ఆయ‌న గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య బ‌దిలీల కోసం ప‌లువురు ఉద్యోగులు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. ఇలాంటి క్ర‌మంలో ఉద్యోగుల అంత‌ర్రాష్ట్ర బ‌దిలీల‌కు ఏపీ ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చినా... అటు తెలంగాణ నుంచి కూడా ఈ బ‌దిలీల‌కు అనుమ‌తి ల‌భిస్తేనే బ‌దిలీలు జ‌ర‌గ‌నున్నాయి. ఫ‌లితంగా ఏపీ నుంచి ఈ బ‌దిలీల‌కు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చిన నేప‌థ్యంలో ఉద్యోగులు ఇప్పుడు తెలంగాణ స‌ర్కారు నిర్ణ‌యం కోసం ఎదురు చూస్తున్నారు. 

తెలుగు రాష్ట్రాల మ‌ధ్య అటు నుంచి ఇటు... ఇటు నుంచి అటు బ‌దిలీ కోరుకుంటున్న ఉద్యోగులు వేల సంఖ్య‌లోనే ఉన్నారు. ఇలా ఏపీ నుంచి తెలంగాణ‌కు బ‌దిలీ కోరుకుంటున్న ఉద్యోగుల సంఖ్య 1,804గా ఉంది. అదే స‌మ‌యంలో తెలంగాణ నుంచి ఏపీకి బ‌దిలీ కోరుకుంటున్న ఉద్యోగుల సంఖ్య‌ 1,338గా ఉంది. వీరంతా త‌మ త‌మ ప్ర‌భుత్వాల‌కు ఇప్ప‌టికే ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఏపీ ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి వ‌చ్చిన నేప‌థ్యంలో ఏపీ నుంచి తెలంగాణ‌కు బ‌దిలీ కోరుకుంటున్న ఉద్యోగుల‌కు ఏపీ స‌ర్కారు ఎన్ఓసీలు ఇస్తోంది. అదే స‌మ‌యంలో తెలంగాణ‌కు బ‌దిలీ కోరుకుంటున్న త‌మ ఉద్యోగుల జాబితాను ఏపీ ప్ర‌భుత్వం తెలంగాణ‌కు పంప‌నుంది.

More Telugu News