Tata Motors: టాటా బ్రాండ్ పై త్వరలో చౌక ఎలక్ట్రిక్ కారు
- తక్కువ ధరకే తీసుకొస్తామని ప్రకటించిన టాటా మోటార్స్
- ప్రస్తుతం టాటా ఈవీల ధర రూ.12.50 లక్షల నుంచి ఆరంభం
- 50వేల ఈవీల విక్రయ లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు వెల్లడి
ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు టాటా మోటార్స్ సంతోషకర విషయాన్ని చెప్పింది. అతి త్వరలో చౌక ఎలక్ట్రిక్ కారును హాచ్ బ్యాక్ విభాగంలో తీసుకురానున్నట్లు ప్రకటించింది. టిగోర్ ఈవీ కంటే తక్కువ సెగ్మెంట్లో అందుబాటు ధరకే ఈవీని తీసుకువస్తామని టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల విభాగం ఎండీ శైలేష్ చంద్ర ప్రకటించారు. టాటా మోటార్స్ నుంచి ఇది అత్యంత అందుబాటు ధరలోని వాహనం అవుతుందని పేర్కొన్నారు. 2018 ఆటో ప్రదర్శనలో టాటా మోటార్స్ టియాగో ఈవీని ప్రదర్శించింది. కానీ, ఇంత వరకు తీసుకురాలేదు. నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీలనే ఇప్పటి వరకు విడుదల చేసింది. ఇప్పుడు టియాగో ఈవీని తీసుకువస్తుందేమో చూడాలి.
టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో దూకుడుగా వెళుతున్న సంగతి తెలిసిందే. మన దేశంలో అమ్ముడుపోతున్న ప్రతి మూడు ఎలక్ట్రిక్ కార్లలో రెండు టాటా మోటార్స్ సంస్థవే కావడం విశేషం. నెక్సాన్, టిగోర్ వెర్షనకు వాడిన జిప్ట్రాన్ టెక్నాలజీనే చౌక వెర్షన్ కారుకు సైతం వినియోగించినట్టు తెలుస్తోంది. దీని ధర రూ.12.50 లక్షల్లోపే ఉంటుందని, పోటీనిచ్చే విధంగా ధరను నిర్ణయిస్తామని శైలేష్ చంద్ర ప్రకటించారు. 2022-23లో 50వేల ఎలక్ట్రిక్ కార్లను విక్రయించాలన్నది తమ లక్ష్యమని తెలిపారు. గత వేసవిలో ముంబైలో టాటా నెక్సాన్ ఈవీలో మంటలు తలెత్తడం అరుదైన ఘటనగా చంద్ర పేర్కొన్నారు. తాము ఇప్పటికి 40వేల ఈవీలు విక్రయించగా, అన్నీ భద్రంగా ఉన్నట్టు చెప్పారు.