Tamilnadu: దొంగతనం కోసం మద్యం దుకాణానికి కన్నమేస్తే.. అదే కన్నంలోంచి బయటికి రప్పించిన పోలీసులు! వీడియో ఇదిగో

Tamilnadu liquor shop thieves drink inside shop

  • తమిళనాడులో సంచలనం సృష్టించిన వింత చోరీ ఘటన
  • చోరీ కోసం వెళ్లి మద్యం షాపులోనే మందేస్తూ కూర్చున్న దొంగలు
  • పోలీసులు అది చూసి.. కన్నంలోంచి వారిని బయటికి రప్పించి అరెస్టు చేసిన వైనం

చతుష్షష్టి కళలు అంటే 64 కళల్లో చోర కళ కూడా ఒకటి అంటారు. చాలా మంది దొంగతనంలో లాఘవం ప్రదర్శిస్తుంటారు. మరికొందరు మాత్రం అడ్డంగా దొరికిపోయి బిక్కమొహాలు వేసుకుంటారు. అయితే తమిళనాడులో మాత్రం ఇద్దరు మందుబాబుల మద్యం చోరీ యత్నం మాత్రం భలే చిత్రంగా ముగిసింది. అడ్డంగా పోలీసులకు దొరికిపోయిన ఆ ఇద్దరు మందు బాబుల వీడియో వైరల్ గా మారింది.

గప్ చుప్ గా వెళ్లిపోకుండా..

తమిళనాడులోని తిరువల్లూర్‌ జిల్లాలో ఇద్దరు మందు బాబులు సమీపంలోని ఓ మద్యం దుకాణంలో చోరీకి స్కెచ్ వేసుకున్నారు. చాలా కష్టపడి వైన్ షాప్ గోడకు కన్నం వేశారు. ఒకరి తర్వాత మరొకరు అందులోంచి షాపులోకి చొరబడ్డారు. ఇక్కడి దాకా బాగానే ఉంది. అయితే చోరీకి వెళ్లినవారు గప్ చుప్ గా మద్యం సీసాలు తీసుకుని వెళ్లిపోకుండా రెండు పెగ్గులు వేద్దామనుకుని కూర్చున్నారు. రెండు పెగ్గులు నాలుగయ్యాయి. మరింత సమయం గడిచిపోయింది.

ఈ క్రమంలో అప్పటికే గస్తీ తిరుగుతున్న పోలీసులకు.. ఏదో అనుమానం వచ్చి ఆ మద్యం దుకాణం దగ్గరికి వచ్చారు. ఓ గోడ దగ్గర ఇటుకలు, మట్టి పడి ఉండటం, కన్నం వేసి ఉండటం చూశారు. ఆ కన్నంలోంచి లోపలికి టార్చిలైట్ వేసి చూస్తే.. ఇద్దరు దొంగలు కూర్చుని మందేస్తున్నారు. ఇంకేం.. రెడ్ హ్యాండెడ్ గా దొంగలు దొరికిపోయారు. అయితే మద్యం దుకాణానికి తాళం వేసి ఉండటంతో పోలీసులు వారిని.. ఆ కన్నంలోంచే బయటికి రమ్మని మర్యాదగా చెప్పారు.

దాంతో దొంగలు చేసేదేమీ లేక వెళ్లిన కన్నంలోంచి బయటికి వచ్చారు. పోలీసులే వారిని మెల్లగా బయటికి లాగి.. అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు 80 వేల మందికిపైగా వీక్షించారు. భలే దొంగలు.. చలాకీ పోలీసులు అన్నట్టుగా నెటిజన్లు పెద్ద సంఖ్యలో కామెంట్లు చేస్తున్నారు.

Tamilnadu
Liquor shop
Liquor Thieves
Offbeat
Police
Thieves

More Telugu News