Nasal Vaccine: ముక్కులో చుక్కల ద్వారా వేసే భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ కు కేంద్రం అనుమతి

Center approves Bharat Biotech Nasal Corona Vaccine
  • నాసల్ వ్యాక్సిన్ కు డీసీజీఐ పచ్చజెండా
  • 18 ఏళ్లకు పైబడినవారికి వ్యాక్సిన్
  • అత్యవసర అనుమతులు మంజూరు
ప్రపంచంలో విప్లవాత్మకమనదగ్గ రీతిలో హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ ముక్కు ద్వారా వేసే కరోనా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ నాసల్ వ్యాక్సిన్ వినియోగానికి కేంద్రం ఆమోదం తెలిపింది. దేశంలో అత్యవసర వినియోగానికి పచ్చజెండా ఊపింది. 

భారత్ బయోటెక్ సంస్థ ఈ నాసల్ వ్యాక్సిన్ ను ఇప్పటిదాకా 4 వేల మంది వలంటీర్లపై పరీక్షించింది. క్లినికల్ ట్రయల్స్ లో నాసల్ వ్యాక్సిన్ సత్ఫలితాలను ఇవ్వగా, ఎక్కడా దుష్పరిణామాలు నమోదు కాలేదు. చింపాంజీ అడినోవైరస్ వెక్టార్ కు కొన్ని మార్పులు చేసి ఈ ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసినట్టు భారత్ బయోటెక్ వెల్లడించింది. 

కాగా, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ స్పందిస్తూ, భారత్ బయోటెక్ కరోనా నాసల్ వ్యాక్సిన్ కు డీసీజీఐ (డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) ఆమోదం తెలిపిందని వెల్లడించారు. దేశంలో 18 ఏళ్లకు పైబడినవారికి ఈ వ్యాక్సిన్ ఇచ్చేందుకు అత్యవసర అనుమతులు లభించాయని వివరించారు. కరోనా మహమ్మారిపై భారత్ సాగిస్తున్న పోరాటాన్ని ఈ వ్యాక్సిన్ మరింత ముందుకు తీసుకెళుతుందని మన్సుఖ్ మాండవీయ అభిప్రాయపడ్డారు.
Nasal Vaccine
Bharat Biotech
Approval
Emergency Use
India

More Telugu News