Chiranjeevi: రక్త దాతలకు మెగాస్టార్ కానుకగా ‘చిరు భద్రత’... గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా కార్డుల పంపిణీ
- చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో 50 కంటే ఎక్కువసార్లు రక్త దానం చేసిన వారికి లైఫ్ జీవిత బీమా సౌకర్యం
- ఇందుకోసం ఉద్దేశించిన ‘చిరు భద్రత’ కార్డులు గవర్నర్ తమిళిసైతో ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి
- తన అభిమానుల ప్రేమను నలుగురికీ పంచాలనే బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశానన్న చిరు
తమ బ్లడ్ బ్యాంక్ ద్వారా 50 కంటే ఎక్కువసార్లు రక్తదానం చేసిన వారికి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ జీవిత బీమా సౌకర్యం కల్పిస్తోంది. ‘చిరు భద్రత’ పేరుతో లైఫ్ ఇన్సూరెన్స్ కార్డులను ఈ రోజు రాజ్ భవన్ లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి అందించారు.
ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతో మందికి సేవ చేస్తున్న చిరంజీవిని అభినందించారు. రక్తదానం చేయడం చిన్న విషయం కాదన్నారు. మెగాస్టార్ తెరమీదే కాకుండా నిజ జీవితంలో కూడా రియల్ హీరో అని కొనియాడారు. తాను సేవ చెయ్యడమే కాకుండా లక్షలాదిమంది సామాజిక సేవ చేసే విధంగా ప్రేరేపించారని ప్రశంసించారు.
చిరంజీవి బ్లడ్ బ్యాంక్ 25 ఏళ్లుగా సేవలందిస్తుందని చెప్పారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఇప్పటి వరకు 9లక్షల 30వేల యూనిట్ల రక్తాన్ని సేకరించడం అసాధారణ విషయమన్నారు. వీటిలో 79% పేదలకు, అణగారిన వర్గాలకు ఉచితంగా పంపిణీ చేశారు, మిగిలిన యూనిట్లను కార్పొరేట్ ఆసుపత్రులకు నామమాత్ర రుసుముకు అందజేసినట్లు గవర్నర్ చెప్పారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మాత్రమే కాకుండా ఐబ్యాంక్ కూడా నిర్వహిస్తున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఐ బ్యాంక్ ద్వారా ఇప్పటి వరకు 4,580 జతల కళ్లు సేకరించినట్లు చెప్పారు. వీటి ద్వారా 9,060 మంది అంధులకు చూపు తెప్పించారన్నారు.
ఒక వైద్యురాలిగా రక్తం కొరత తనకు తెలుసని, రక్తదానం చేయమని ప్రజలను ఒప్పించడం ఎంత కష్టమో కూడా తనకు తెలుసని ఆమె అన్నారు. తాను హౌస్ సర్జన్ గా పని చేస్తున్నప్పుడు రోగులకు అవసరమైన రక్తం అందించేందుకు వారి కుటుంబ సభ్యులు కూడా ముందుకు రాని సందర్భాలు ఉన్నాయన్నారు. రాజ్ భవన్ తరఫున కూడా రక్తదాన కార్యక్రమాలు చేపడుతున్నానని గవర్నర్ చెప్పారు.
అవసరమైన వారికి సకాలంలో రక్తం అందించేందుకు ఇప్పటికే ఓ యాప్ రూపొందించామని, చిరంజీవి ట్రస్ట్ కూడా ఇందులో భాగం కావాలని కోరారు. మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే ఆయన అభిమానుల నిబద్ధతను ప్రభావితం చేయడం వల్లే చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా అద్భుతమైన మైలురాళ్లను సాధించడం సాధ్యమైందని తెలిపారు.
ఇవే కాకుండా కరోనా మహమ్మారి సమయంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అద్భుతమైన సేవలు అందించిందని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేసి ఎంతోమంది ప్రాణాలు కాపాడారని అన్నారు.
చిరంజీవి బృహత్తరమైన ఆలోచనలకు అండగా నిలుస్తూ చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తదానం చేసిన వారిని ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై అభినందించారు. వీరు ఎంతోమంది ప్రాణాలు కాపాడడంలో కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు.
ఇక, రక్తదాతలను సన్మానించడంతో పాటు “చిరు భద్రత” కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ గవర్నర్ డా.తమిళిసై గారికి మెగాస్టార్ చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలు కాపాడాలని చిరంజీవి కోరారు. ఒక దాత ఇచ్చిన రక్తంతో ముగ్గురిని బ్రతికించవచ్చని చెప్పారు. రక్తదానంపై అవగాహన పెంచడంలో గవర్నర్ డా. తమిళిసై పాత్రను ప్రశంసించారు. ఈ సందర్భంగా రక్తదాతలను అభినందించిన చిరంజీవి వీరే నిజమైన వీరులనీ, ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారని చెప్పారు.
1998లో రక్తం అందుబాటులో లేక చాలా మంది చనిపోయిన ఘటనలు తనను ఎంతో బాధ పెట్టాయని, అప్పుడే బ్లడ్ బ్యాంక్ ఆలోచన వచ్చిందని చిరంజీవి ఈ సందర్భంగా చెప్పారు. తన కోసం ఏదైనా అభిమానుల ప్రేమని నలుగురికీ ఉపయోగపడేలా మార్చాలనే ఉద్దేశంతో బ్లడ్ బ్యాంక్ ప్రారంభించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రక్తదాతలకు గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా ‘చిరు భద్రత’ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కార్డులను అందజేశారు. వీరందరూ వందలాది మంది ప్రాణాలను కాపాడారని చిరంజీవి అభినందించారు. వీరినీ, వీరి కుటుంబాలను కాపాడాల్సిన బాధత్య తనపై ఉందని ఈ సందర్భంగా చిరంజీవి చెప్పారు.
తరచుగా రక్తదానం చేసే 2000 మందికి 7లక్షల విలువ చేసే ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. వీరందరి ఇన్సూరెన్స్ ప్రీమియం చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ చెల్లింస్తుందని చెప్పారు.
.