Telangana: అన్ని నియోజకవర్గాల్లో మరింత మందికి దళిత బంధు.. తెలంగాణ కేబినెట్ నిర్ణయం
- పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపాలని నిర్ణయం
- మున్సిపల్ కార్పొరేషన్లలో కో–ఆప్షన్ సభ్యుల పెంపునకు గ్రీన్ సిగ్నల్
- కొత్త జిల్లాల్లో కోర్టు భవనాల నిర్మాణానికి స్థలాల కేటాయింపు
తెలంగాణలో దళిత బంధు పథకం కింద అందిస్తున్న రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని మరింతగా విస్తరించాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది. ఇప్పటికే ఒక్కో నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారులను దళిత బంధు కోసం ఎంపిక చేస్తుండగా.. దీనికి అదనంగా ప్రతి నియోజకవర్గంలో మరో 500 మందికి కూడా దళిత బంధు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయానికి వచ్చింది. దీనికి సంబంధించి లబ్ధిదారుల గుర్తింపు వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
పోడు భూముల సమస్యకు పరిష్కారం
తెలంగాణలో చాలాకాలంగా కొనసాగుతున్న పోడు భూముల సమస్యను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని మంత్రివర్గ భేటీలో తీర్మానించారు. పోడు భూముల సమస్య ఉన్న జిల్లాల్లో రెవెన్యూ, అటవీ, గిరిజన సంక్షేమశాఖలతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పోడు సాగు చేసే వారు ఎందరు, ఎంత భూమి ఇలా సాగవుతోందనేది తేల్చాలని.. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ సోమేశ్ కుమార్ కు సూచించారు.
మున్సిపల్ చట్ట సవరణకు ఓకే
గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో కో-ఆప్షన్ సభ్యుల సంఖ్యను పెంచాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ, మున్సిపాలిటీల చట్ట సవరణ బిల్లులకు ఆమోద ముద్ర వేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో ప్రస్తుతం ఐదుగురు కో-ఆప్షన్ సభ్యులుండగా.. ఈ సంఖ్యను 15కు పెంచారు. ఇతర కార్పొరేషన్లలో 5 నుంచి 10 వరకు కో-ఆప్షన్ సభ్యులను పెంచాలని నిర్ణయించారు.
- ఇక రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన అటవీ యూనివర్సిటీకి నూతన పోస్టులను మంజూరు చేశారు. సుంకిశాల నుంచి హైదరాబాద్ నగరానికి అదనంగా 33 టీఎంసీల నీటిని శుద్ధిచేసి సరఫరా చేయాలని నిర్ణయించారు.
- రాష్ట్రవ్యాప్తంగా కొత్త జిల్లాల్లో కోర్టు భవనాల నిర్మాణం కోసం 21 జిల్లా కేంద్రాల్లో స్థలాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
- భద్రాచలంలో గోదావరి ముంపు ప్రాంతాల్లో నివసిస్తున్న 2,016 కుటుంబాలకు కొత్త కాలనీలు నిర్మించాలని తీర్మానించారు.