Southern Zonal Council: ముగిసిన దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశం... గైర్హాజరైన రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు
- తిరువనంతపురం వేదికగా సదస్సు
- మొత్తంగా 26 అంశాలపై జరిగిన చర్చ
- 9 అంశాలకు అక్కడికక్కడే లభించిన పరిష్కారం
కేరళ రాజధాని తిరువనంతపురం వేదికగా దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశం శనివారం సాయంత్రం ముగిసింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కేరళ సీఎం పినరయి విజయన్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక సీఎంలు ఎంకే స్టాలిన్, బసవరాజ్ బొమ్మైలు హాజరయ్యారు.
ఇక ఈ సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు గైర్హాజరయ్యారు. తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ హాజరు కాగా... ఏపీ నుంచి అధికారుల బృందం హాజరైనట్లు సమాచారం.
ఇదిలా ఉంటే... దక్షిణాది రాష్ట్రాల మధ్య సహకారం, వివాదాల పరిష్కారమే లక్ష్యంగా సాగిన ఈ సమావేశంలో మొత్తంగా 26 అంశాలపై చర్చ జరిగింది. వీటిలో 9 అంశాలకు అక్కడికక్కడే పరిష్కారం లభించే దిశగా చర్చలు ఫలించాయి. అదే సమయంలో మిగిలిన 17 అంశాలపై మలి విడత సమావేశంలో చర్చించనున్నట్లు అమిత్ షా తెలిపారు.