Andhra Pradesh: నిలకడగా మంత్రి విశ్వరూప్ ఆరోగ్యం... హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసిన వైద్యులు
![city neuro hospital releases ap minister pinipe viswarup health bulletin](https://imgd.ap7am.com/thumbnail/cr-20220903tn63132f2667819.jpg)
- విశ్వరూప్‌కు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు వైద్యుల నిర్ధారణ
- హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్‌లో మంత్రికి చికిత్స
- ఇప్పటికైతే విశ్వరూప్‌కు ప్రమాదమేమీ లేదన్న వైద్యులు
ఏపీ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు శనివారం వైద్యులు ప్రకటించారు. శుక్రవారం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాలలో పాల్గొన్న తర్వాత ఉన్నట్లుండి అనారోగ్యానికి గురైన విశ్వరూప్‌ను ఆయన కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు.
హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్‌లో మంత్రి విశ్వరూప్ చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ఆసుపత్రి వైద్యులు మంత్రి ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. మంత్రికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం మంత్రి ఆరోగ్యం నిలకడగానే ఉందన్న వైద్యులు... ఇప్పటికైతే పెద్దగా ప్రమాదమేమీ లేదని తెలిపారు.