Sri Lanka: శ్రీలంక జట్టులో ప్రపంచస్థాయి ఆటగాళ్లు లేరన్న బంగ్లాదేశ్ డైరెక్టర్.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన శ్రీలంక క్రికెటర్

Maheesh Theekshana Strong Counter To Bangladesh Team Director

  • బంగ్లాదేశ్ జట్టులో ఇద్దరు మాత్రమే వరల్డ్ క్లాస్ బౌలర్లు ఉన్నారన్న లంక కెప్టెన్
  • తమ జట్టులో కనీసం ఇద్దరైనా ఉన్నారన్న బంగ్లా జట్టు డైరెక్టర్
  • బంగ్లాదేశ్‌పై విజయం తర్వాత లంక క్రికెటర్ మహీష్ తీక్షణ ట్వీట్
  • 11 మంది సహోదరులు ఉంటే చాలంటూ కౌంటర్

శ్రీలంక జట్టులో ఒక్కరు కూడా ప్రపంచ స్థాయి ఆటగాళ్లు లేరన్న బంగ్లాదేశ్ క్రికెట్ డైరెక్టర్ ఖలెద్ మహ్‌మూద్ వ్యాఖ్యలకు శ్రీలంక క్రికెటర్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. ఆసియాకప్‌లో భాగంగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో శ్రీలంక పరాజయం పాలైంది. దీంతో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ శ్రీలంకకు కీలకంగా మారింది. 

ఆ మ్యాచ్‌కు ముందు లంక కెప్టెన్ దాసున్ శంక మాట్లాడుతూ.. ఆఫ్ఘనిస్థాన్ జట్టులో ప్రపంచస్థాయి బౌలర్లు ఉన్నారని, తమ ఓటమికి అది కూడా ఓ కారణమని అన్నాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో పోలిస్తే బంగ్లాదేశ్‌లో ముస్తాఫిజుర్, షకీబల్ హసన్ తప్ప ప్రపంచస్థాయి బౌలర్లు లేరని, కాబట్టి ఆఫ్ఘనిస్థాన్‌తో పోలిస్తే బంగ్లాదేశ్ తమకు సులభమైన ప్రత్యర్థి అని పేర్కొన్నాడు.

ఈ వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు డైరెక్టర్ ఖలెద్ స్పందిస్తూ.. లంక కెప్టెన్ అలా ఎందుకన్నాడో తనకు తెలియదని అన్నాడు. ఆఫ్ఘనిస్థాన్‌కు ఉత్తమమైన టీ20 స్క్వాడ్ ఉందన్న విషయం వాస్తవమే అయినా, తమను సులభమైన ప్రత్యర్థిగా ఎలా అనుకుంటున్నాడో అర్థం కావడం లేదన్నాడు. తమ జట్టులో కనీసం ఇద్దరు వరల్డ్ క్లాస్ బౌలర్లు అయినా ఉన్నారని, శ్రీలంక జట్టులో తనకు ఒక్కరు కూడా అలాంటి వారు కనిపించలేదని అన్నాడు. మైదానంలో ఎలా ఆడతామనేదే ముఖ్యమని, ఏం జరుగుతుందో చూద్దామని ట్వీట్ చేశాడు. 

ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో జరిగిన పోరులో శ్రీలంక 2 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించి సూపర్-4లో అడుగుపెట్టింది. సంతోషంలో లంక క్రికెటర్లు నాగిని డ్యాన్స్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం శ్రీలంక క్రికెటర్ మహీష్ తీక్షణ ఓ ట్వీట్ చేస్తూ.. 11 మంది సహోదరులు ఉన్నప్పుడు ప్రపంచస్థాయి ఆటగాళ్లు ఉండాల్సిన అవసరం లేదని ట్వీట్ చేశాడు. ఇప్పుడీ ట్వీట్ వైరల్ అయింది. బంగ్లాదేశ్ టీమ్ డైరెక్టర్‌కు భలేగా కౌంటర్ ఇచ్చాడంటూ లంక అభిమానులు కామెంట్లు చేస్తూ సంబరపడిపోతున్నారు.

  • Loading...

More Telugu News