YSRCP: తనకు న్యాయం జరగడం లేదని ఆరోపిస్తూ.. మంత్రి విడదల రజనీ కార్యాలయం ముందు వ్యక్తి ఆత్మహత్యాయత్నం
![a man attempt to suicide before ap minister vidadala rajani office](https://imgd.ap7am.com/thumbnail/cr-20220902tn63121dbbe3b61.jpg)
- చిలకలూరిపేటలోని రజనీ కార్యాలయం వద్ద ఘటన
- పురుగుల మందు డబ్బాతో వచ్చిన గీత కార్మికుడు వెంకటేశ్వర్లు
- కిందపడిపోయిన వెంకటేశ్వర్లును ఆసుపత్రికి తరలించిన స్థానికులు
ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ కార్యాలయం ముందు శుక్రవారం సాయంత్రం ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే వెనువెంటనే గుర్తించిన స్థానికులు అతడిని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం బాధితుడిని మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటన వివరాల్లోకెళితే... చిలకలూరిపేటలో ఉన్న విడదల రజనీ కార్యాలయం వద్దకు శుక్రవారం సాయంత్రం గీత కార్మికుడు పోతునూరి వెంకటేశ్వర్లు వచ్చాడు. చేతిలో పురుగుల మందు డబ్బాతో అక్కడికి వచ్చిన అతడు... తనకు న్యాయం జరగడం లేదని ఆరోపిస్తూ ఉన్నపళంగా కింద పడిపోయాడు. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించగా... వెంకటేశ్వర్లు పురుగుల మందు తాగినట్లు వైద్యులు తేల్చారు.