Haranath: అలనాటి 'అందాల నటుడు' హరనాథ్ జీవితచరిత్రను ఆవిష్కరించిన సూపర్ స్టార్ కృష్ణ... వీడియో ఇదిగో!
- గ్లామర్ హీరోగా పేరుగాంచిన హరనాథ్
- 70 సినిమాల్లో నటించిన వైనం
- 'అందాల నటుడు' పేరుతో ఆయన జీవితంపై పుస్తకం
- కృష్ణ నివాసంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం
తెలుగు చిత్రసీమలో హీరో హరనాథ్ కు ప్రత్యేకస్థానం ఉంటుంది. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలంలో హరనాథ్ గొప్ప అందగాడిగా పేరుగాంచారు. మా ఇంటి మహాలక్ష్మి, శ్రీ సీతారామ కల్యాణం, కలిసి ఉంటే కలదు సుఖం, ఆత్మబంధువు వంటి చిత్రాలతో అలరించారు. ఆయన తన కెరీర్ లో దాదాపు 70 సినిమాల్లో నటించారు. వాటిలో ఇతర భాషా చిత్రాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు 'అందాల నటుడు' పేరుతో హరనాథ్ జీవితచరిత్ర రూపుదిద్దుకుంది. ఈ పుస్తకాన్ని సూపర్ స్టార్ కృష్ణ నేడు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ, హరనాథ్ నిజంగానే అందాల నటుడు అని కీర్తించారు. తనను హీరోగా పెట్టి హరనాథ్ 'మా ఇంటి దేవత' అనే చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాడని గుర్తుచేసుకున్నారు. తామిద్దరం కలిసి అనేక చిత్రాల్లో నటించామని, చాలా మంచి వ్యక్తి అని కొనియాడారు.
'అందాల నటుడు' పేరుతో హరనాథ్ జీవితాన్ని ఆయన అభిమాని డాక్టర్ కంపల్లి రవిచంద్రన్ అక్షరబద్ధం చేశారు. ఇందులో ఇప్పటిదాకా చాలామందికి తెలియని వివరాలు, అరుదైన ఫొటోలు పొందుపరిచారు.
ఇవాళ హరనాథ్ జయంతి. ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ నివాసంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హరనాథ్ కుమార్తె పద్మజ, అల్లుడు జీవీజీ రాజు, మనవళ్లు శ్రీరామ్, శ్రీనాథ్ పాల్గొన్నారు.
కాగా, హరనాథ్ కుమారుడు శ్రీనివాస్ రాజు ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నారు. ఆయన గతంలో గోకులంలో సీత, రాఘవేంద్ర వంటి చిత్రాలను నిర్మించారు. హరనాథ్ అల్లుడు జీవీజీ రాజు కూడా నిర్మాతే. ఆయన తొలిప్రేమ, గోదావరి చిత్రాలను నిర్మించారు.