Asia Cup 2022: ఆసియాకప్‌లో బోణీ కొట్టిన శ్రీలంక.. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడిన బంగ్లాదేశ్

SL clinch thrilling victory against bangladesh

  • ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడిన బంగ్లాదేశ్
  •  భారీ లక్ష్యాన్ని మరో 4 బంతులు ఉండగానే ఛేదించిన శ్రీలంక
  • 60 పరుగులు చేసిన కుశాల్ మెండిస్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు

ఆసియాకప్‌లో శ్రీలంక బోణీ కొట్టింది. గత రాత్రి బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో విజయం సాధించి ఖాతా తెరిచింది. బంగ్లాదేశ్ మాత్రం ఆడిన రెండు మ్యాచుల్లోనూ పరాజయం పాలైంది. షకీబల్ సేన నిర్దేశించిన 184 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని శ్రీలంక మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

 కుశాల్ మెండిస్ 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ దాసున్ శంక 45 పరుగులు చేశాడు. చివరి ఓవర్ వరకు సాగిన ఈ మ్యాచ్‌‌లో విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడినప్పటికీ చివరికి శ్రీలంకనే వరించింది. బంగ్లాదేశ్ బౌలర్లలో ఎబడాట్ హొసైన్‌కు 3, తస్కిన్ అహ్మద్‌కు 2 వికెట్లు లభించాయి.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. అఫిఫ్ హొసైన్ 39, మెహిదీ హసన్ మిరాజ్ 38, కెప్టెన్ షకీబల్ హసన్ 24, మహ్మదుల్లా 27, మొసాదక్ హొసైన్ 24 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో వనిందు హసరంగ, చమిక కరుణరత్నె చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించిన కుశాల్ మెండిస్‌కు ‘ప్లేయర్ ఆప్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఆసియాకప్‌లో నేడు పాకిస్థాన్-హాంకాంగ్ జట్లు తలపడతాయి.

Asia Cup 2022
Sri Lanka
Bangladesh
Kusal Mendis
  • Loading...

More Telugu News