YSRCP: సర్పంచ్ సీట్లో ఏపీ సీఎం జగన్... ఫొటో ఇదిగో
![ap cm ys jagan sits ina sarpanch seat in kadapa district](https://imgd.ap7am.com/thumbnail/cr-20220901tn6310da73b7829.jpg)
- కడప జిల్లా పర్యటనకు వెళ్లిన జగన్
- వేల్పుల గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించిన వైనం
- గ్రామ సర్పంచ్ సీట్లో కూర్చుని ఫొటోలకు పోజిచ్చిన సీఎం
తన సొంత జిల్లా కడప జిల్లా పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని వేముల మండలం వేల్పుల గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవన సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. సచివాలయాన్ని ప్రారంభించిన అనంతరం భవనంలోని గదులను పరిశీలించిన జగన్... సర్పంచ్‌కు కేటాయించిన గదిలోకి వెళ్లారు.
గ్రామ సర్పంచ్ నిర్మలను వెంటబెట్టుకుని సర్పంచ్ సీటు వద్దకు వెళ్లిన జగన్.. సర్పంచ్ సీట్లో కూర్చుని ఫొటోలకు పోజిచ్చారు. తన వెంట వచ్చిన సర్పంచ్ నిర్మలను కూడా తన పక్కన నిలబెట్టుకుని ఆయన ఫొటోలు దిగారు. ఈ ఫొటోను వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జీ, ఏపీ ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ గుర్రంపాటి దేవేంద్రరెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
"తన పర బేధం లేకుండా సామాన్యుని సైతం అక్కున చేర్చుకునే వ్యక్తిత్వం జగనన్న సొంతం.. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మహోన్నత వ్యక్తి, తనను నమ్ముకున్న అతి సామాన్య సర్పంచ్ ని పక్కన పెట్టుకుని ఫోటో దిగడం బహుశా రాజకీయ చరిత్రలోనే ఇప్పటిదాకా చూడని సంఘటన..' అంటూ ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.