CPM: బీజేపీపై కేసీఆర్ చేస్తున్న రాజకీయాలను స్వాగతిస్తున్నాం: తమ్మినేని వీరభద్రం

CPM announces support to TRS

  • మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు సీపీఎం మద్దతు
  • మునుగోడు ఉప ఎన్నిక వరకే మద్దతన్న తమ్మినేని వీరభద్రం
  • రాష్ట్రంలో కాంగ్రెస్ స్థానంలో ఉండేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోందని వ్యాఖ్య

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఇంతకాలం కమ్యూనిస్టులను దగ్గరకే రానివ్వని ముఖ్యమంత్రి కేసీఆర్... ఇప్పుడు రూటు మార్చారు. దీంతో, గులాబీ జెండా దగ్గరకు ఎర్ర జెండాలు చేరుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు మద్దతునిస్తున్నట్టు సీపీఎం ప్రకటించింది. హైదరాబాద్ లోని ఎంబీ భవన్ లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ, టీఆర్ఎస్ కు మద్దతిస్తున్నట్టు తెలిపారు. ప్రజలకు టీఆర్ఎస్ అన్యాయం చేసిందని చెప్పిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. 

మునుగోడులో బీజేపీని గెలిపిస్తే నెల రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొడతామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారని... రాష్ట్రంలో పూర్తి మెజార్టీతో అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ఎలా పడగొడతారని తమ్మినేని అన్నారు. ఎమ్మెల్యేలను కొనడం, ఈడీని వాడటం వంటి చర్యలతో బీజేపీ ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతోందని చెప్పారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్ స్థానంలో ఉండేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోందని తమ్మినేని అన్నారు. టీఆర్ఎస్ కు తమ మద్దతు మునుగోడు ఎన్నికల వరకేనని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ చేస్తున్న రాజకీయాలను స్వాగతిస్తున్నామని అన్నారు.

CPM
Tammineni Veerabhadram
KCR
TRS
Munugode
  • Loading...

More Telugu News