Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ సమాచారం చెప్పిన వారికి భారీ రివార్డ్ ప్రకటించిన ఎన్ఐఏ!
- 1993లో ముంబైలో వరుస బాంబు పేలుళ్లకు పాల్పడిన డీ గ్యాంగ్
- దావూద్ సమాచారం ఇస్తే రూ. 25 లక్షల రివార్డు
- చోటా షకీల్ సమాచారం ఇస్తే రూ. 20 లక్షల రివార్డు
పాకిస్థాన్ లో తలదాచుకున్న అండర్ వరల్డ్ డాన్, ఇండియాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం, అతని ప్రధాన అనుచరుడు చోటా షకీల్ ఆచూకీ కానీ, వారికి సంబంధించిన సమాచారం కానీ చెప్పిన వారికి భారీ రివార్డ్ ఇస్తామని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ప్రకటించింది. దావూద్ కు చెందిన సమాచారం ఇచ్చిన వారికి రూ. 25 లక్షలు, చోటా షకీల్ సమాచారం ఇచ్చిన వారికి రూ. 20 లక్షలు ఇస్తామని ప్రకటించింది. ఇతర టెర్రరిస్టులు అనీస్ ఇబ్రహీం, జావెద్ చింకా, టైగర్ మెమన్ లపై రూ. 15 లక్షల చొప్పున రివార్డ్ ప్రకటించింది.
గత ఏడాది ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ మాట్లాడుతూ... దావూద్, ఇతరులందరూ లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, ఆల్ ఖైదా వంటి అంతర్జాతీయ టెర్రరిస్టు ఆర్గనైజేషన్లతో కలిసి పని చేస్తున్నారని తెలిపింది. బంగారం స్మగ్లింగ్, నకిలీ కరెన్సీ చలామణి చేస్తూ కార్యకలాపాలను కొనసాగించిన దావూద్ కు చెందిన 'డీ కంపెనీ' రాత్రికి రాత్రే టెర్రరిస్ట్ సంస్థగా మారిపోయి 1993లో ముంబైలో వరుస బాంబు పేలుళ్లకు పాల్పడిందని పేర్కొంది. ఈ పేలుళ్లలో 250కి పైగా అమాయకులు ప్రాణాలను కోల్పోయారని... మిలియన్ల డాలర్ల విలువైన ఆస్తుల నష్టం జరిగిందని తెలిపింది.