Vodafone Idea: ప్రమాదంలో వొడాఫోన్ ఐడియా యూజర్ల డేటా!
- 30 కోట్ల మంది యూజర్ల డేటా లీక్
- నెట్ ప్రపంచంలోకి చేరినట్టు సైబర్ ఎక్స్9 ఆరోపణ
- డేటా లీక్ కాలేదంటూ వొడాఫోన్ ఐడియా ప్రకటన
వొడాఫోన్ ఐడియా యూజర్ల డేటా పెద్ద మొత్తంలో లీక్ అయిందని ఓ ప్రైవేటు సంస్థ ప్రకటించింది. సైబర్ సెక్యూరిటీ పరిశోధనా సంస్థ అయిన ‘సైబర్ ఎక్స్9’ చెబుతున్న దాని ప్రకారం వొడాఫోన్ ఐడియాకు చెందిన 30 కోట్ల మంది కస్టమర్ల కాల్ లాగ్స్, సున్నితమైన వ్యక్తిగత డేటా లీక్ అయింది. ఇదంతా ఇంటర్నెట్ ప్రపంచంలోకి చేరిపోయినట్టు సదరు సంస్థ చెబుతోంది.
ఈ వార్తలపై వొడాఫోన్ ఐడియా స్పందించింది. తన బిల్లింగ్ కమ్యూనికేషన్ సిస్టమ్ లో లోపం ఉన్నట్టు అంగీకరించింది. అయితే, దీన్ని వెంటనే సరి చేసినట్టు వొడాఫోన్ ఐడియా ప్రకటించింది. అయితే తాము చేసిన ఫోరెన్సిక్ విశ్లేషణలో డేటా లీక్ అయినట్టు తేలలేదని స్పష్టం చేసింది. సైబర్ ఎక్స్9 చేసిన ఆరోపణల్లో నిజం లేదని, హానికారకమైనవిగా అభివర్ణించింది. తాము తమ సదుపాయాలను ఎప్పటికప్పుడు ఆడిట్ చేస్తుంటామని తెలిపింది.
కానీ, సైబర్ ఎక్స్9 నివేదిక ప్రకారం వొడాఫోన్ ఐడియా యూజర్ల కాల్ లాగ్స్, ఏ కాల్ ఎంత సమయం పాటు మాట్లాడింది? ఏ లొకేషన్ నుంచి మాట్లాడారు? ఫోన్ నంబర్? తదితర సమాచారం లీక్ అయింది.