Couple: నెల్లూరులో దంపతుల దారుణ హత్య... వివరాలు ఇవిగో!

Couple brutally murdered by thieves in Nellore

  • అశోక్ నగర్ లో ఘటన
  • ఒంటరిగా ఉన్న మహిళపై దాడి
  • ఇంట్లో డబ్బు, నగల కోసం వెదికిన దుండగులు
  • గేటు వద్ద ఎదురైన ఇంటి యజమాని
  • ఆయనను గొంతుకోసి చంపిన వైనం

నెల్లూరులో వాసిరెడ్డి కృష్ణారావు, సునీత అనే దంపతులను దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. కృష్ణారావు, సునీత దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారికి వివాహాలు కావడంతో, తల్లిదండ్రుల నుంచి వేరుగా ఉంటున్నారు. కృష్ణారావు, సునీత దంపతులు అశోక్ నగర్ లో ఉంటున్నారు. కృష్ణారావుకు హోటల్ తో పాటు క్యాటరింగ్ వ్యాపారం కూడా ఉంది. ఆయన తన వ్యాపార పనులు చూసుకుని రాత్రి పొద్దుపోయాక ఇంటికి వస్తుంటారు. కాగా, భర్త వస్తాడని సునీత తలుపుకు తాళం వేయకుండా ఉంచింది. ఆపై తన గదిలోకి వెళ్లి నిద్రపోయింది. 

ఆ సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన కొందరు దుండగులు... గదిలో నిద్రిస్తున్న సునీతను కర్రతో కొట్టి చంపారు. అనంతరం, డబ్బు, బంగారం కోసం ఇల్లంతా వెదికారు. ఏమీ దొరక్కపోవడంతో తీవ్ర అసహనంతో వెనుదిరిగారు. అదే సమయంలో కృష్ణారావు ఇంట్లోకి వస్తున్నారు. తన ఇంట్లోంచి కొత్త వ్యక్తులు వస్తుండడంతో కృష్ణారావు గట్టిగా కేకలు వేశారు. అయితే, ఆ దుండగులు కృష్ణారావును గొంతుకోసి చంపేశారు. ఇదంతా శనివారం రాత్రి జరిగింది. 

ఆదివారం ఉదయం కృష్ణారావు, సునీతల మృతదేహాలను స్థానికులు గుర్తించి వారి బంధువులకు సమాచారం అందించారు. ఈ జంట హత్యలపై సమాచారం అందుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ తో సంఘటన స్థలానికి వచ్చారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నిస్తోంది. దీనిపై నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు స్పందించారు. ఈ కేసును తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని, హంతకులను త్వరలోనే పట్టుకుంటామని స్పష్టం చేశారు.

Couple
Murder
Nellore
Thieves
Police
  • Loading...

More Telugu News