Afghanistan: ఆసియా కప్ తొలి మ్యాచ్‌లోనే సంచలనం.. శ్రీలంకపై ఆఫ్ఘనిస్థాన్ భారీ విజయం
- ఆఫ్ఘనిస్థాన్ బౌలర్ల ధాటికి శ్రీలంక విలవిల
- 105 పరుగులకే కుప్పకూలిన లంక
- 10.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన ఆఫ్ఘాన్
- ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా ఫజల్లా ఫరూకీ
ఆసియాకప్ తొలి మ్యాచ్‌లోనే సంచలనం నమోదైంది. ఆల్‌రౌండర్లతో బలంగా ఉన్న శ్రీలంక జట్టును ఆఫ్ఘనిస్థాన్ మట్టి కరిపించింది. తొలుత బంతులతో శ్రీలంకను 105 పరుగులకే కట్టిపడేసిన ఆఫ్ఘన్.. ఆ తర్వాత బ్యాటింగులోనూ రెచ్చిపోయి 10.1 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు హజ్రతుల్లా జాజయ్ 28 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 37(నాటౌట్) పరుగులు చేయగా, రహ్మతుల్లా గుర్బాజ్ 18 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. ఇబ్రహీం జద్రాన్ 15, నజీబుల్లా జద్రాన్ 2 (నాటౌట్) పరుగులు చేశారు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఆఫ్ఘనిస్థాన్ బౌలర్ల దెబ్బకు విలవిల్లాడింది. తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయిన లంక.. మూడో ఓవర్‌లో మరోటి కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కుశాల్ మెండిస్ (2), అసలంక (0), పాథుమ్ నిశ్శంక (3) దారుణంగా విఫలమయ్యారు. 5 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన లంకను గుణతిలక (17), బి.రాజపక్స (38) కొంత ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ క్రీజులో కుదురుకున్నారనుకున్న సమయంలో మరోమారు ఆ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. గుణతిలకను అవుట్ చేయడంతో ద్వారా ముజీబ్ వీరి భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఆ తర్వాత కాసేపటికే బి.రాజపక్స రనౌట్ అయ్యాడు. దీంతో శ్రీలంక మరోమారు కష్టాల్లో కూరుకుపోయింది.
ఆ వెంటనే హసరంగ(2), కెప్టెన్ శనక డకౌట్ కావడంతో ఇక కోలుకోలేకపోయింది. చివర్లో కరుణరత్న 31 పరుగులు చేయడంతో జట్టు స్కోరు 100 పరుగులు దాటింది. తీక్షణ ఒక్క బంతి కూడా ఆడకుండానే రనౌట్‌గా వెను దిరగ్గా, మహీశ పథిరన 5, దిల్షాన్ మధుశంక ఒక పరుగు చేశాడు. ఫలితంగా లంక ఇన్నింగ్స్ 19.4 ఓవర్లలో 105 పరుగుల వద్ద ముగిసింది. ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఫజల్లా ఫరూకీ 3 వికెట్లు తీసుకోగా, ముజీబ్, కెప్టెన్ నబీ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ఆసియా కప్‌లో భాగంగా నేడు భారత్-పాక్ జట్లు తలపడతాయి.