Janasena: ఈ ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు?... జగన్ సర్కారుకు పవన్ కల్యాణ్ ప్రశ్న!
![pawan kalya tweet on ys jagans love over environment](https://imgd.ap7am.com/thumbnail/cr-20220827tn630a066051733.jpg)
- శుక్రవారం విశాఖలో పర్యటించిన సీఎం జగన్
- ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే దిశగా రాష్ట్ర ప్రజలకు పిలుపు
- ఇప్పుడే పర్యావరణంపై ప్రేమ పుట్టుకొచ్చిందా? అంటూ పవన్ ప్రశ్న
- విష వాయువుల లీకేజీ, మరణాల నివారణకు చర్యలేవి అని నిలదీత
- నిందితుల్లో ఒక్కరిపైనా చర్యలు లేవంటూ ధ్వజమెత్తిన జనసేనాని
విశాఖ పర్యటనలో భాగంగా శుక్రవారం ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే దిశగా రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 2027లోగా ఏపీని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని కూడా జగన్ ప్రకటించారు. జగన్ ప్రకటనపై శనివారం సాయంత్రం జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తూ, ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్‌ను పోస్ట్ చేశారు.
విశాఖలో పారిశ్రామిక కాలుష్యాన్ని తగ్గించే దిశగా ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పవన్ తన ట్వీట్‌లో నిలదీశారు. విష వాయువుల లీకేజీ, వాటి కారణంగా జరుగుతున్న మరణాలను అరికట్టే దిశగానూ ఎలాంటి చర్యలు లేవని తెలిపారు. వీటికి కారకులైన వారిలో ఏ ఒక్కరిపైనా ఇప్పటిదాకా చర్యలు తీసుకున్న దాఖలానే లేదని పేర్కొన్నారు. రుషికొండను ధ్వంసం చేయడమే లక్ష్యంగా సాగుతున్నారని ఆరోపించారు. ఇవన్నీ జరుగుతున్న తరుణంలో ఇప్పుడు ఒక్కసారిగా పర్యావరణంపై ప్రేమ ఎలా పుట్టుకొచ్చింది? అని పవన్ ప్రశ్నించారు. ఈ తరహా ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు? అంటూ జగన్ సర్కారును పవన్ ప్రశ్నించారు.