TRS: ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చే నీచానికి పాల్పడుతున్నారు: కల్వకుంట్ల కవిత
- కవితను కలిసి సంఘీభావం తెలిపిన పలువురు నేతలు
- చిచ్చుపెట్టే వారిని ప్రజాస్వామ్య వాదులు తిప్పికొట్టాలన్న కవిత
- ఢిల్లీ పీఠాలను కదిలించిన గొప్ప చరిత్ర తెలంగాణకు ఉందన్న ఎమ్మెల్సీ
- ఢిల్లీ కుట్రలను ఛేదించి రాష్ట్రాన్ని కాపాడుకుందామని పిలుపు
ముుఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం బంగారు తెలంగాణగా మారుతున్న తరుణంలో కొందరు ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చే నీచానికి పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కవిత ఇంటిపై బీజేపీ కార్యకర్తల దాడిని ఖండిస్తూ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ దామోదర్‌రావు, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, విప్ అరికపూడి గాంధీ, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సహా పలువురు ప్రముఖులు నిన్న కవితను ఆమె నివాసంలో కలిసి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో విభిన్న సంస్కృతుల మధ్య చిచ్చుపెట్టే వారిని ప్రజాస్వామ్య వాదులు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అస్థిత్వాన్ని చాటుతూ ఢిల్లీ కుట్రలకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. తెలంగాణకు ప్రత్యేక చరిత్ర ఉందని, ఢిల్లీ పాలకులపై పోరాడి పీఠాలు కదిలించిన ఘన చరిత్ర రాష్ట్రం సొంతమన్నారు. స్వయం సమృద్ధితో అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు నిధులు ఇవ్వకుండా కేంద్రం వివక్ష చూపిస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వాలపై దుష్ప్రచారం చేస్తూ విద్వేషాలను రెచ్చగొడుతోందని ఆరోపించారు. ఈ కుట్రలను ఛేదించి తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటుకోవాలని కవిత పేర్కొన్నారు.