Ahmedabad: రేపు అహ్మదాబాద్‌లో అటల్ బ్రిడ్జి ప్రారంభం... నిర్మాణ శైలిని ఆకాశానికెత్తేసిన వైసీపీ ఎంపీ సాయిరెడ్డి
- అహ్మదాబాద్‌లో గాలి పటం ఆకృతిలో బ్రిడ్జి నిర్మాణం
- సబర్మతి నదిపై పాదచారుల కోసమే ఈ బ్రిడ్జి రూపకల్పన
- రేపు ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ
గుజరాత్ వాణిజ్య రాజధాని అహ్మదాబాద్‌లో కేంద్ర ప్రభుత్వం నూతనంగా అటల్ బ్రిడ్జి పేరిట ఓ బ్రిడ్జిని నిర్మించింది. సబర్మతి నదిపై పాదచారుల కోసం మాత్రమే నిర్మించిన ఈ బ్రిడ్జిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు (శనివారం) లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో పలువురు బీజేపీ నేతలు, ఇతర పార్టీల నేతలు ఈ బ్రిడ్జి విశిష్టతల గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇందులో భాగంగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్‌ను పెట్టారు.
గాలి పటం ఆకృతిలో అటల్ బ్రిడ్జిని అద్భుతంగా నిర్మించారంటూ సదరు ట్వీట్‌లో సాయిరెడ్డి పేర్కొన్నారు. ఇంజినీరింగ్‌లో ఇదో గొప్ప నిర్మాణంగా నిలుస్తుందని చెప్పిన సాయిరెడ్డి... అహ్మదాబాద్ సిగలో ఇదో కలికితురాయిగా నిలుస్తుందని తెలిపారు. ఇదే బ్రిడ్జిపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా ఓ ట్వీట్‌ను పోస్ట్ చేశారు. అభివృద్ధి చెందుతున్న భారత మౌలిక సదుపాయాల రంగంలో ఈ బ్రిడ్జికి ప్రత్యేక స్థానం దక్కడం ఖాయమని ఆమె పేర్కొన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి ఇదో అద్భుతమైన నివాళిగా నిలుస్తుందని తెలిపారు.