Shashi Tharoor: ఖుష్బూని ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్ చేసిన శశి థరూర్

Shashi Tharoor appreciates Khushbu

  • 2002లో గుజరాత్ అల్లర్లు
  • ముస్లిం మహిళ బిల్కిస్ బానోపై అత్యాచారం
  • 11 మందికి జీవితఖైదు.. ఇటీవలే విడుదల
  • మానవాళికే మచ్చ అంటూ ఖుష్బూ ఆగ్రహం

ప్రముఖ సినీ నటి ఖుష్బూ కొంతకాలం కిందట కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరడం తెలిసిందే. అయితే, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్... తమ పార్టీ మాజీ నేత పట్ల ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇటీవల బిల్కిస్ బానో అత్యాచార దోషులకు క్షమాభిక్ష ప్రకటించి విడుదల చేయడాన్ని ఖుష్బూ ఖండించారు. గుజరాత్ లో ఉన్న బీజేపీ ప్రభుత్వమే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఓ మహిళగా ఆ నిర్ణయాన్ని ఖుష్బూ వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ఆమెను శశి థరూర్ అభినందించారు. 

2002 గుజరాత్ అల్లర్ల సందర్భంగా ముస్లిం మహిళ బిల్కిస్ బానో అత్యాచారానికి గురైంది. ఈ కేసులో 11 మంది నిందితులను దోషులుగా నిర్ధారించి వారికి జీవితఖైదు విధించారు. అయితే, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వారిని ప్రభుత్వం విడుదల చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు భగ్గుమంటున్నాయి. ఖుష్బూ కూడా తీవ్రస్థాయిలో స్పందించారు. 

"దారుణ హింసను ఎదుర్కొని, అత్యాచారానికి గురై, తల్లడిల్లిన హృదయంతో కుంగిపోయిన ఆ మహిళకు న్యాయం జరగాలి. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఏ ఒక్కరినీ విడిచిపెట్టకూడదు. ఒకవేళ వారిని విడిచిపెట్టారంటే అది మానవాళికే మచ్చలాంటిది, స్త్రీత్వానికే అవమానం. ఇలాంటి పరిస్థితుల్లో బిల్కిస్ బానో కానీ, మరే ఇతర మహిళ కానీ... రాజకీయాలకు, సిద్ధాంతాలకు అతీతంగా ఆమెకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది" అని ఖుష్బూ స్పష్టం చేశారు. 

దీనిపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పందిస్తూ... "ఖుష్బూ వినండి... మీరు స్వపక్షం కంటే న్యాయం కోసం నిలబడడం చూస్తుంటే గర్వంగా ఉంది" అంటూ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News