Komatireddy Venkat Reddy: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి హాజరవుతా: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
![komatireddy says hat he will attends munugodu bypoll campaign](https://imgd.ap7am.com/thumbnail/cr-20220825tn6307a12254de8.jpg)
- మునుగోడు ఎన్నికల ప్రచారానికి హాజరుకాబోనని గతంలో కోమటిరెడ్డి ప్రకటన
- తాజాగా అభ్యర్థి ఎంపికపై కోమటిరెడ్డితో మల్లు భట్టి విక్రమార్క భేటీ
- అభ్యర్థిపై తన అభిప్రాయాన్ని వెల్లడించిన వెంకట్ రెడ్డి
- అవసరమైనప్పుడు ప్రచారానికీ వస్తానని వెల్లడి
నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి హాజరు కాబోనంటూ నిన్నటిదాకా ప్రకటిస్తూ వచ్చిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురువారం కాస్తంత మెత్తబడ్డారు. టీపీసీసీలో స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న తనను పార్టీ పెద్దలు అవమానించారని ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసిన కోమటిరెడ్డి...తాను మునుగోడు ఎన్నికల ప్రచారానికి హాజరు కాబోనని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికకు సంబంధించి గురువారం కోమటిరెడ్డితో టీసీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మునుగోడులో పార్టీ అభ్యర్థిగా ఎవరైతే బాగుంటుందన్న విషయంపై కోమటిరెడ్డి తన అభిప్రాయాన్ని భట్టి విక్రమార్కకు తెలిపారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి మునుగోడు ఎన్నికల ప్రచారానికి తాను హాజరు అవుతానని ప్రకటించారు. అయితే అవసరం అయినప్పుడు మాత్రమే తాను ఎన్నికల ప్రచారానికి వెళతానని ఆయన మరో మెలిక పెట్టారు. ఇదే విషయాన్ని పార్టీ అధిష్ఠానానికి తెలియజేయాలని భట్టి విక్రమార్కను ఆయన కోరారు. అందుకు భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించడంతో ఎన్నికల ప్రచారానికి వస్తానంటూ కోమటిరెడ్డి ప్రకటించారు.