Jogi Ramesh: చంద్రబాబుకు పవన్ కల్యాణ్ వీకెండ్ కాల్షీట్లు అమ్ముకున్నాడు: మంత్రి జోగి రమేశ్

Jogi Ramesh slams Pawan Kalyan

  • పవన్ వీకెండ్ నాటకాలు వేస్తున్నాడన్న జోగి రమేశ్
  • 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా అంటూ సవాల్
  • పవన్ సేద్యం గురించి మాట్లాడడం విడ్డూరం అంటూ విమర్శలు
  • పవన్ కనీసం కార్పొరేటర్ గా కూడా గెలవలేడన్న వెల్లంపల్లి

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి జోగి రమేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు పవన్ కల్యాణ్ వీకెండ్ కాల్షీట్లు అమ్ముకున్నాడని వ్యాఖ్యానించారు. పవన్ వీకెండ్ నాటకాలు వేస్తున్నాడని అన్నారు. తనను నమ్మిన కొంతమంది కాపు సామాజిక వర్గం వారిని చంద్రబాబుకు అమ్మేయడానికి పవన్ నాటకాలకు తెరలేపాడని విమర్శించారు. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పే దమ్ముందా? అంటూ పవన్ కు మంత్రి జోగి రమేశ్ సవాల్ విసిరారు. వ్యవసాయం, కౌలు రైతుల గురించిన కనీస అవగాహన లేని పవన్, సేద్యం గురించి మాట్లాడడం విడ్డూరం అని పేర్కొన్నారు. 

అటు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా పవన్ పై ధ్వజమెత్తారు. చంద్రబాబు దత్తపుత్రుడు షూటింగ్ గ్యాప్ లో బయటికి వచ్చాడని ఎద్దేవా చేశారు. నాడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో అసలైన కోవర్టు పవన్ కల్యాణే అని అన్నారు. చిరంజీవి అధికారం పొందలేకపోయాడని ఆయనను పక్కనబెట్టాడని వ్యాఖ్యానించారు. గతంలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయొద్దని పవన్ ఎందుకు చెప్పలేకపోయాడని వెల్లంపల్లి ప్రశ్నించారు. 

అసలు, చిరంజీవి లేకపోతే పవన్ ఎక్కడున్నాడని పేర్కొన్నారు. పవన్ కనీసం కార్పొరేటర్ గా కూడా గెలవలేడని ఎద్దేవా చేశారు. ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్న వైసీపీ సర్కారుపై అక్కసు వెళ్లగక్కుతున్నాడని విమర్శించారు.

Jogi Ramesh
Pawan Kalyan
Chandrababu
Vellampalli Srinivasa Rao
YSRCP
Janasena
TDP
  • Loading...

More Telugu News