Hyderabad: నాటి కొత్వాల్‌కు నేటి కొత్వాల్ నివాళి!... ఫొటో ఇదిగో!
![hyderabad cp cv anand pay homage to Raja Bahadur Venkata Ram Reddy](https://imgd.ap7am.com/thumbnail/cr-20220822tn6303a1d4b6c13.jpg)
- నిజాం పాలనలో కొత్వాల్‌గా పనిచేసిన రాజా బహదూర్ వెంకటరామ్ రెడ్డి
- నేడు రాజా బహదూర్ జయంతి
- బహదూర్ విగ్రహానికి నివాళి అర్పించిన నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్
రాజా బహదూర్ వెంకట రామ్ రెడ్డి పేరు వినని హైదరాబాదీ గానీ, తెలంగాణ వాసి గానీ ఉండరంటే అతిశయోక్తి కాదేమో. అదే సమయంలో ఇప్పటి తరానికి అంతగా తెలియని కొత్వాల్ అనే పదం కూడా తెలంగాణ వాసులకు కొత్తదేమీ కాదు. హైదరాబాద్‌కు చెందిన మధ్య వయస్కులైతే ఇప్పటికీ అదే పేరును వాడుతూనే ఉన్నారు కూడా. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ పదవినే నిజాం పాలనలో కొత్వాల్ అని పిలిచేవారు. అందుకే, ఇప్పటికీ చాలా మంది అలాగే పిలుస్తున్నారు కూడా.
నిజాం పాలనలో 1920- 34 మధ్య హైదరాబాద్‌కు 14వ కొత్వాల్‌గా సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించిన రాజా బహదూర్ వెంకట రామ్ రెడ్డి చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. ఇప్పటికీ హైదరాబాద్ పోలీసు శాఖ ఆయన జయంతి, వర్థంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటూనే ఉంటుంది. అందులో భాగంగానే సోమవారం రాజా బహదూర్ జయంతిని పురస్కరించుకుని నగరంలోని ఆయన విగ్రహానికి ప్రస్తుత నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నివాళి అర్పించారు. ఆ ఫొటోను సీవీ ఆనంద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.