Delhi Liquor Scam: ఎమ్మెల్సీ కవిత ఇంటి ముట్టడికి బీజేవైఎం యత్నం... అడ్డుకుని అరెస్ట్ చేసిన పోలీసులు
![bjym activists try to attack trs mlc kavitha house](https://imgd.ap7am.com/thumbnail/cr-20220822tn63036bdf7e9b8.jpg)
- ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు పాత్ర ఉందంటూ ఆరోపణలు
- ఆరోపణలను ఖండించిన కవిత
- కవిత ఇంటిని ముట్టడించేందుకు బీజేవైఎం యత్నం
ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కాం తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఉద్రిక్తతలకు తెర తీసింది. ఈ వ్యవహారంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులకు పాత్ర ఉందంటూ బీజేపీ ఎంపీ ఒకరు ఆదివారం సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ స్కాంలో కేసీఆర్ తనయ కవితకు ప్రత్యక్షంగా పాత్ర ఉందంటూ మరో ఎంపీ కూడా ఆరోపించారు. ఈ ఆరోపణలను నేడు స్వయంగా కవిత ఖండించారు.
మరోపక్క, ఈ సాయంత్రానికే ఆమె ఇంటి ముట్టడికి బీజేపీ యువజన విభాగం బీజేఐఎం నేతలు యత్నించారు. అయితే అప్పటికే ఇలాంటి ఆందోళనలు జరిగే అవకాశం ఉందన్న అనుమానంతో కవిత ఇంటి వద్ద భారీగా బలగాలు మోహరించాయి. బీజేవైఎం కార్యకర్తలు కవిత ఇంటిలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీజేవైఎం, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఫలితంగా అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎట్టకేలకు బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.