Telangana: మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కదు: మంత్రి జగదీశ్ రెడ్డి
- బండి సంజయ్ పాత్రలో అమిత్ షా కనిపించారన్న జగదీశ్ రెడ్డి
- అబద్దాలతోనే అమిత్ షా ప్రసంగం సాగిందని ఆరోపణ
- సీఎం కేసీఆర్ ప్రశ్నలకు సమాధానాలే చెప్పలేదని ఎద్దేవా
మునుగోడులో ఆదివారం జరిగిన బీజేపీ బహిరంగ సభలో ఆ పార్టీ అగ్ర నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన ప్రసంగంపై టీఆర్ఎస్ కీలక నేత, తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఎలాంటి ఆధారం లేకుండా మాట్లాడే బండి సంజయ్ పాత్రను అమిత్ షా పోషించారని ఆయన ఎద్దేవా చేశారు. అమిత్ షా వరాలు ప్రకటిస్తారని మునుగోడు ప్రజలు ఆశపడ్డారని, అయితే అమిత్ షా మాటలు వారిని నీరుగార్చాయన్నారు. మునుగోడు ప్రజలు చైతన్యవంతులనీ, బీజేపీకి తప్పక మీటరు బిగిస్తరని ఆయన పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కదని ఆయన జోస్యం చెప్పారు.
మునుగోడు సభలో అమిత్ షా ప్రసంగమంతా అబద్ధాలతోనే సాగిందని జగదీశ్ రెడ్డి అన్నారు. తన ప్రసంగంలో అమిత్ షా అన్నీ నిరాధార ఆరోపణలు చేశారని విమర్శించారు. సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారన్నారు. సీఎం ప్రశ్నలకు జవాబు చెప్పే దమ్ముకూడా బీజేపీ నేతలకు లేదన్నారు. దిగజారుడు తనం అమిత్ షా మాటల్లో ధ్వనించిందన్నారు. ప్రపంచంలోనే అద్భుత పథకం రైతుబీమా అన్న మంత్రి.. ఫ్లోరైడ్ నివారణకు ప్రధానమంత్రి ఏమైనా చేశారా? అని నిలదీశారు. పెట్రోల్ ధరలపై అమిత్ షా మాటలు దొంగే దొంగ అన్నట్లుందని జగదీశ్ రెడ్డి విమర్శించారు.