Janasena: తిరుపతిలో జనసేన జనవాణి.. రాయలసీమలో ఫ్యాక్షనే కనిపించలేదన్న పవన్
![pawan attends janavaani in tirupati](https://imgd.ap7am.com/thumbnail/cr-20220821tn630212ee8a2dc.jpg)
- ప్రజా సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణకే జనవాణి
- తిరుపతి జనవాణిలో ఫిర్యాదులు స్వీకరించిన పవన్
- కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు తాను రాలేదని వెల్లడి
ఏపీలో ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజల సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణ, వాటి పరిష్కారం కోసం కృషి చేసే దిశగా జనసేన ప్రారంభించిన జనవాణిలో భాగంగా రాయలసీమ ప్రాంతానికి చెందిన జనవాణిని ఆదివారం తిరుపతిలో చేపట్టారు. తిరుపతి పరిధిలోని రామానుజపల్లి జేఆర్ఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారం ప్రారంభమైన ఈ కార్యక్రమానికి జనసేనాని పవన్ కల్యాణ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన పవన్ కల్యాణ్... రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పంచాయతీలకు నిధుల విడుదల ఆగిపోయిందన్నారు. డబ్బు, అధికారం మీ వద్దే ఉంచుకుని ఇతరులకు కాస్తంత గౌరవం ఇవ్వండని ఆయన వైసీపీ నేతలకు సూచించారు. టీడీపీతో పాటు వైసీపీకి కొమ్ము కాయడానికి తాను సిద్ధంగా లేనని తెలిపారు. ఏదో సామాజిక వర్గానికి మా పార్టీని అమ్మేయడమే మా పనా? అంటూ ఆయన ప్రశ్నించారు.
కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు తాను రాలేదని వెల్లడించారు. దేశానికి మూడో ప్రత్యామ్నాయం ఉండాలన్న పవన్... రాష్ట్రంలో మాత్రం మూడో ప్రత్యామ్నాయం తప్పనిసరిగా అవసరమని అభిప్రాయపడ్డారు. రాయలసీమలో ఫ్యాక్షన్ ఉంటుందని అందరూ అంటూ ఉంటారన్న పవన్... ఇప్పటిదాకా తనకు సీమలో ఫ్యాక్షనే కనిపించలేదని అన్నారు.