Madhya Pradesh: తలకు గాయమై ఆసుపత్రికి వస్తే.. కండోమ్ ప్యాక్‌తో కట్టుకట్టారు
- మధ్యప్రదేశ్‌లోని మురేనా జిల్లాలో ఘటన
- కట్టుకట్టినా రక్తం ఆగకపోవడంతో జిల్లా ఆసుపత్రికి తరలింపు
- కుట్లు వేసేందుకు కట్టు విప్పడంతో విషయం వెలుగులోకి
- డ్రెస్సర్‌ను సస్పెండ్ చేసిన అధికారులు
తలకు గాయమై రక్తమోడుతున్న మహిళ ఆసుపత్రికి వస్తే కండోమ్ కవర్‌తో కట్టుకట్టిన ఘటన మధ్యప్రదేశ్‌లోని మురేనా జిల్లాలో జరిగింది. కట్టుకట్టినప్పటికీ రక్తం అదుపులోకి రాకపోవడంతో ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడామె కట్టును విప్పిన వైద్యులు కండోమ్ ప్యాక్ చూసి విస్తుపోయారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ధరమ్‌గఢ్ గ్రామానికి చెందిన 70 ఏళ్ల వృద్ధురాలి తలకు ప్రమాదవశాత్తు గాయమైంది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే పోర్సా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి సిబ్బంది ఆమె గాయానికి కట్టుకట్టారు. అయినప్పటికీ రక్తస్రావం ఆగకపోవడంతో ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన అక్కడి వైద్యులు కుట్లు వేసేందుకు కట్టు విప్పారు. గాయంపై కనిపించిన కండోమ్ ప్యాక్ చూసి ఆశ్చర్యపోయారు.
విషయం వెలుగులోకి వచ్చి విమర్శలు వెల్లువెత్తడంతో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా స్పందించారు. బాధిత మహిళ రేష్మాబాయ్ ఆసుపత్రికి వచ్చిన సమయంలో డాక్టర్ ధర్మేంద్ర రాజ్‌పుత్, వార్డ్‌బాయ్ ఎమర్జెన్సీ విధుల్లో ఉన్నట్టు చెప్పారు. పోర్సా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డ్రెస్సర్‌ను సస్పెండ్ చేసినట్టు చెప్పారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు పేర్కొన్నారు.