KCR: మోదీ ఏం పీక్కుంటావో.. పీక్కో: కేసీఆర్

KCR fires on Modi

  • దేశంలో ప్రజాస్వామ్య విలువలు పోయాయన్న కేసీఆర్
  • మెజార్టీ ఉన్న ప్రభుత్వాలను కూడా కూల్చేస్తామంటున్నారని మండిపాటు
  • తెలంగాణ ప్రజల స్పందన మునుగోడు నుంచి ఢిల్లీకి వెళ్లాలని వ్యాఖ్య

భారత ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఉపఎన్నిక రాబోతున్న మునుగోడులో నిర్వహించిన ప్రజాదీవెన సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ... టీఆర్ఎస్ కు ఘన విజయాన్ని కట్టబెట్టాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని చెప్పారు. కొత్త వ్యవసాయ మీటర్లు పెట్టాలని తెలంగాణపై కేంద్రం ఒత్తిడి తెస్తోందని... అయినా, రైతుల మేలు కోసం కేంద్రం ఒత్తిడికి తాము తలొగ్గడం లేదని అన్నారు. 

'రేపు మునుగోడులో బీజేపీ గెలిస్తే... నేను మీటర్లు పెట్టమన్నా నీవు పెట్టడం లేదు... అయినా మునుగోడులో ప్రజలు నాకే ఓటు వేశారు... నువ్వు పక్కకు జరుగు అని నన్ను తోసేసి మీకు కొత్త మీటర్లు పెడతారని' అన్నారు. మీకు మీటర్లు పెట్టే నరేంద్ర మోదీ బీజేపీ కావాలా? లేక మీటర్లు వద్దనే టీఆర్ఎస్ కేసీఆర్ కావాలా? అని ప్రశ్నించారు. ఈ విషయంపై ప్రతి గ్రామంలో చర్చ జరగాలని అన్నారు. పెద్దలు, యువకులు, మేధావులు, రైతుబంధు పొందుతున్న రైతులు దీనిపై చర్చించాలని చెప్పారు. 

కొత్త వ్యవసాయ మీటర్లు పెట్టనని మోదీతో తాను కొట్లాడుతున్నానని... నా బలం, నా ధైర్యం మీరే కదా అని కేసీఆర్ అన్నారు. మీరే నన్ను బలహీనపరిస్తే నేను ఏం చేయాలని ఓటర్లను అడిగారు. మునుగోడు చరిత్రలో బీజేపీకి ఎప్పుడూ డిపాజిట్ కూడా రాలేదని... ఇప్పుడు వస్తుందా అని ప్రశ్నించారు. బీజేపీకి ఓటు పడితే మీ బాయి కాడకు మీటర్ వస్తుందనే విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. 

ఈ దేశంలో ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయా? అని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే... అందులో 103 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలేనని చెప్పారు. మరో ఏడు మంది మన మిత్రపక్షమని... మిగిలిన తొమ్మిది తోకల్లో రెండు పార్టీలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. 110 తోకలున్నోన్ని పడగొట్టి తెలంగాణలో కూడా ఒక ఏక్ నాథ్ షిండేను  తెస్తాడంట... ఇది అహంకారమా? బలుపా? అధికారమదంతో కళ్లు మూసుకుపోయాయా? అని ప్రశ్నించారు. 

ఈడీ కేసులు పెడతామంటూ ముఖ్యమంత్రులను, పెద్దపెద్దవాళ్లను బెదిరిస్తున్నారని కేసీఆర్ అన్నారు. నీ మీద ఈడీ కేసు పెడతామంటే... ఈడీనా, బోడీనా అని తాను అన్నానని... ఈడీ వస్తే తన వద్ద ఏముందని వ్యాఖ్యానించారు. ఏం పీక్కుంటావో పీక్కో... ప్రజల కోసం ఆలోచించేవాళ్లు, ప్రజలకు కడుపునిండా బుక్కెడు అన్నం దొరకాలనుకునేవాళ్లు నీకు భయపడరు మోదీ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ దేశం ఎవని అయ్య సొత్తు కాదని అన్నారు. 

తమిళనాడులో స్టాలిన్ టూ థర్డ్ మెజార్టీతో గెలిచారని... ఆయన ప్రభుత్వాన్ని కూడా పడగొడతానని మోదీ అంటున్నారని కేసీఆర్ మండిపడ్డారు. పశ్చిమబెంగాల్ చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో మమతా బెనర్జీ గెలిచారని, అక్కడకు పోయి నిన్ను పడగొడతా అంటున్నారని విమర్శించారు. మోదీ నిన్ను పడగొట్టేటోళ్లు లేరనుకుంటున్నావా... నీకు వేరే శత్రువు అవసరం లేదు.. నీ అహంకారం, నీ గర్వమే నీకు శత్రువు అవుతుంది అని అన్నారు. 

మునుగోడులో ఇప్పుడు ఉపఎన్నిక పెట్టాల్సిన అవసరం ఏముందని కేసీఆర్ ప్రశ్నించారు. ఒక ఏడాది ఆగితే ఎన్నికలు జరిగేవి కదా అని అన్నారు. కొట్లాటలు తెలంగాణకు కొత్త కాదని... కొట్లాట మొదలైతే ఎంత దూరమైనా పోతామని చెప్పారు. కాంగ్రెస్ కి ఓటేసినా వేస్టేనని అన్నారు. వేసే ఓటేదో ఒక దిక్కే వేయాలని... అప్పుడే సరైన మెసేజ్ ఢిల్లీకి పోతుందని చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ ఎంతో బలంగా ఉందని... మునుగోడుది కేవలం ఉపఎన్నిక అని అన్నారు. అయినప్పటికీ మునుగోడులో టీఆర్ఎస్ ను గెలిపించుకోవాలని... మనమేంటో ఢిల్లీ పెద్దలకు తెలియజేయాలని చెప్పారు. తెలంగాణ ప్రజలు ఎలా స్పందిస్తున్నారనే విషయం మునుగోడు నుంచి ఢిల్లీకి మెసేజ్ వెళ్లాలని అన్నారు.

  • Loading...

More Telugu News